వనంలోకి తల్లులు
మంచిర్యాలఅర్బన్: స్థానిక గోదావరి నదీ తీరాన మూడు రోజులపాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వనదేవతల జాతర శనివారం ముగిసింది. చివరి రోజు తల్లుల దర్శనానికి భక్తజనం పోటెత్తింది. మధ్యాహ్నం 12.30గంటలకు గిరిజన పూజారి సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం సమ్మక్క, సారలమ్మలను వన ప్రవేశం చేయించారు. జాతర ప్రత్యేక అధికారి రవికిషన్‌గౌడ్, ఈవో ముక్తా రవి, పూజారి సతీష్ వనదేవతలకు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి గౌతమేశ్వర ఆలయ సమీపంలోని చెట్లపొదల్లో ఇల్లారిలో దేవతలను వనప్రవేశం చేయించారు. భక్తులు పెద్దయెత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతర ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ సభ్యులు సేవలందించారు. పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రత చర్యలు చేపట్టారు.
జాతర హుండీ లెక్కింపు
జాతరలో ఏర్పాటు చేసిన హుండీలను శనివారం పోలీసుల పర్యవేక్షణలో దేవదాయ, ధర్మదాయ శాఖ సిబ్బంది, జాతర సేవా కమిటీ సభ్యులు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వాలంటీర్లు లెక్కించారు. రూ.14,67,450 ఆదాయం రాగా, 900 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, 444గ్రాముల మిశ్రమ వెండి కానుకల రూపంలో భక్తులు సమర్పించారు. దుకాణాల ఏర్పాటుకు బహిరంగ వేలం, హుండీ, టెంకాయ రశీదు, కేశఖండనం, ప్రత్యేక దర్శనం రశీదు ఆదాయం మొత్తం రూ.31,19,080 సమకూరింది. జాతర పర్యవేక్షణాధికారి రంగు రవికిషన్‌గౌడ్, ఈవో ముక్తా రవి, తదితరులు పాల్గొన్నారు.
వనంలోకి తల్లులు
వనంలోకి తల్లులు


