తెలంగాణ సాయుధ పోరు నుంచి.. రంగనాథ్‌రావు
తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ రంగనాథ్ రావు బొల్లాన్‌వార్ ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఆవిర్భావంతోనే ఎన్నికల బరిలో నిలిచారు. నాడు నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సీపీఐపై అప్పట్లో నిషేధం విధించారు. దీంతో ఆ పార్టీకి చెందిన నాయకుడైనప్పటికీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున మున్సిపల్ బరిలో నిలిచారు. అధ్యక్షుడిగా విజయం సాధించి 1952 నుంచి 1961 వరకు దాదాపు దశాబ్దకాలం పాటు పట్టణ ప్రజలకు సేవలందించారు. ఈ క్రమంలో అదే పార్టీ తరఫున 1957లో ఎమ్మెల్యేగా పోటీచేసి ప్రజల మద్దతుతో అసెంబ్లీలో అడుగు పెట్టారు. చైర్మన్, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మరోసారి మున్సిపల్ బరిలో నిలిచి గెలుపొందారు. రెండోసారి 1967 నుంచి 1972 వరకు చైర్మన్‌గా సేవలందించారు. పదవులు చేపట్టినప్పటికీ అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడివలే కాలినడకన తిరిగేవారని ఆయన వ్యక్తిత్వాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు ఆయన సమకాలికులు.


