నగరంలో 60 డివిజన్లు గెలిపించాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 59 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, ఒక స్థానంలో మిత్రపక్షం సీపీఐ పోటీ చేస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, రాళ్లవాగుకు కరకట్ట నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోపు పూర్తి చేస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం పలు పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్‌లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నాయకులు పాల్గొన్నారు.


