వైద్యం వికటించి యువతి మృతి
తాండూర్: మండల కేంద్రానికి చెందిన అక్కెపల్లి భాగ్యలక్ష్మి(24) వైద్యం వికటించి మృతిచెందింది. ప్రియుడే కారణమని ఆరోపిస్తూ మృతురాలి సోదరుడు అక్కెపల్లి కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. భాగ్యలక్ష్మి హైదరాబాద్ హయత్‌నగర్‌లోని బీసీ బాలికల గురుకులంలో నాలుగు నెలలుగా ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. తాండూర్‌కే చెందిన గట్టు జగదీష్ కొంతకాలంగా తన సోదరిని ప్రేమించానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తమకు తెలియకుండా హైదరాబాద్‌లో గర్భస్రావం చేయించేందుకు పలు రకాలుగా ప్రయత్నించాడని, సఫ లం కాకపోవడంతో కర్నూల్‌లోని ఓ ఆస్పత్రిలో బుధవారం గర్భస్రావానికి ప్రయత్నించగా తీవ్ర రక్తస్రావమై గురువారం చనిపోయిందని తెలిపారు. ఈ విషయం జగదీష్ తనకు ఫోన్ చేసి మీ సోదరి ఆరోగ్యం బాగా లేదని తన స్నేహితులతో కలిసి ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందిందని చెప్పాడని కుమారస్వామి తెలిపారు. తన సోదరి మృతికి జగదీష్ కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూర్ ఇన్‌చార్జి ఎస్సై సౌజన్య తెలిపారు.


