దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
పాతమంచిర్యాల: జిల్లా ప్రధాన ఆస్పత్రి(జీజీహెచ్) క్యాజువాలిటీ విభాగంలో సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీజీహెచ్ పారా మెడికల్ జేఏసీ అధ్యక్షుడు నాందేవ్, ప్రధాన కార్యదర్శి రమేష్ అన్నారు. గురువారం సెక్యూరిటీ సిబ్బందిపై దాడిని నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై రోగుల బంధులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని, ఆస్పత్రి వద్ద నిరంతర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పారా మెడికల్ జేఏసీ ప్రధాన సలహాదారు ఆల్లాడి శ్రీనివాస్, కోశాధికారి శంకర్, మహిళా కార్యదర్శి పద్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


