జోరుగా నామినేషన్లు
రెండ్రోజుల్లో 374
నస్పూర్: జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్, చెన్నూర్, లక్సెట్టిపేట, క్యాతనపల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో రెండ్రోజుల్లో 374 నామినేషన్లు దాఖలయ్యాయి. కలెక్టరేట్‌లోని మంచిర్యాల కార్పొరేషన్ నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సందర్శించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు 186, బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులకు 97, చెన్నూర్‌లో 18 వార్డులకు 29, క్యాతనపల్లిలో 22 వార్డులకు 32, లక్సెట్టిపేటలో 15 వార్డులకు 30 నామినేషన్లు వచ్చాయి. జిల్లాలో మొత్తం 149 వార్డులకు 374 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
లక్సెట్టిపేటలో అధికారులకు నామినేషన్ పత్రం అందజేస్తున్న అభ్యర్థి
సాక్షి ప్రతినిధి మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు జోరందుకున్నాయి. ఈ నెల 28న స్వీకరణ ప్రారంభం కాగా.. రెండో రోజు గురువారం భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. మంచిర్యాల కార్పొరేషన్, బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేటలో భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం ఐదు గంటల వరకే అనుమతిస్తారు. నామినేషన్ల దాఖలుకు సమయం పడితే వరుసలో ఉన్న వారందరికీ నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తారు. అధికార కాంగ్రెస్ పార్టీ మొదలు బీఆర్‌ఎస్, బీజేపీలో పలు చోట్ల అభ్యర్థులకు టికెట్ల ఖరారులో జాప్యం జరగడంతో పోటీపై మల్లగుల్లాలు పడ్డారు. చివరగా పార్టీ బీ ఫాం సమర్పణకు మరో రోజు గడువు ఉండడంతో ఆయా డివిజన్లు, వార్డుల్లో నామినేషన్లు వేస్తున్నారు. బకాయిలు ఉన్న ఇంటి, నల్లా పన్నులు కడుతూ నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకుంటూ పోటీకి నిలబడ్డారు. ఇక కొందరు పోటీ అధికంగా ఉన్న చోట్ల రెండు వార్డుల్లోనూ నామినేషన్లు వేస్తున్నారు. బీ ఫాం దక్కిన చోట పోటీకి నిలబడే అవకాశం ఉంది. దీంతో ఒక్కో అభ్యర్థి రెండు, మూడు సెట్ల చొప్పున దాఖలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో 60డివిజన్లలో ఓ కొలిక్కి వచ్చాయి. టికెట్లు దక్కని వారు కొందరు రెబల్స్‌గా వేసేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు ఇతర పార్టీల్లోకి మారి నామినేషన్లు వేస్తున్నారు.
కొనసాగుతున్న ప్రక్రియ
నస్పూర్/చెన్నూర్/లక్సెట్టిపేట/బెల్లంపల్లి: మంచిర్యాల కార్పొరేషన్‌లో నామినేషన్ల స్వీకరణ రెండో రోజు గురువారం కొనసాగింది. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. 60 డివిజన్లకు గాను మొదటి రోజు 20 నామినేషన్లు రాగా.. రెండో రోజు 166 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తంగా నామినేషన్ల సంఖ్య 186కు చేరింది.
జోరుగా నామినేషన్లు
జోరుగా నామినేషన్లు


