మైసమ్మ జాతరకు సర్వం సిద్ధం
రామకృష్ణాపూర్: గిరిజనుల ఆరాధ్య దైవం మైసమ్మ తల్లి జాతర నేడు శుక్రవారం నుంచి ప్రారంభకానుంది. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని గాంధారి ఖిల్లాలో సర్వం సిద్ధమైంది. చారిత్రాత్మక ప్రాంతం, ఎంతో ప్రాశాస్త్యమున్న ఖిల్లా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. జాతర జరిగే ఖిల్లా ప్రాంతానికి భక్తులు ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం విద్యుత్, నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, షామియానాలు తదితర ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాతోపాటు ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కూడా గిరిజనులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
600 ఏళ్ల క్రితం వెలుగొందిన ఖిల్లా...
సుమారు 600 ఏళ్ల పూర్వం కాకతీయుల సామంతులుగా పిలువబడే ఒడ్డెరాజుల కాలంలో గాంధారి ఖిల్లా వెలుగొందినట్లు చరిత్ర చెబుతోంది. ఒడ్డెరాజుల కాలంలో నిర్మించిన ఈ ఖిల్లా అప్పటి వారి కళా నైపుణ్యానికి అద్దం పడుతోంది. ఖిల్లాలో నాగశేషుడి విగ్రహం, శివుడు, విఘ్నేశ్వరుడు, ఆంజనేయుడు, కాలభైరవుని విగ్రహాలతోపాటు దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. ఖిల్లా పై భాగంలో శత్రువుల రాకను పసిగట్టేందుకు నగారా గుండు నిర్మించారు. కొండను తొలిచి నిర్మించిన నాగశేషుడి ఆలయం ఆకట్టుకుంటుంది. దిగువ భాగంలో సహజసిద్ధంగా ఉండే ఊటచెలిమెకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నీళ్లు ఎప్పటికీ ఇంకిపోకుండా పైకి తేలుతుంటాయి. గుట్టపై నిర్మించిన కోటలో అనేక కళారూపాలు, శిలాసంపద, విగ్రహాలు ఉండడంతో జాతరకు హాజరయ్యే భక్తులతోపాటు ఖిల్లాను తిలకించేందుకు వచ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది.
కార్యక్రమాలు ఇలా..
జాతరలో భాగంగా మొదటి రోజు శుక్రవారం దేవతామూర్తులను సదర్‌భీమన్న నుంచి సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి గంగ స్నానానికి తరలిస్తారు. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, పిల్లన గ్రోవి వాయిద్యాలు, డప్పుచప్పుళ్ల నడుమ మంచిర్యాలలోని గోదావరికి వెళ్లి అదే రోజు సాయంత్రం తిరిగి సదర్‌భీమన్న వద్దకు దేవతామూర్తులను తీసుకువస్తారు. రాత్రి ఆటపాటలతో గడిపి మరుసటి రోజు శనివారం జాతర జరిగే ఖిల్లా ప్రాంతానికి దేవతామూర్తులను తరలిస్తారు. రాత్రి మరోసారి ఆటపాటలు, ఆదివాసీ నాయక్‌పోడ్‌ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆదివారం తెల్లవారుజామున గాంధారి ఖిల్లా పైభాగంలో ఉన్న మైసమ్మ తల్లి వద్ద పట్నాలు వేసి, నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం జీడికోటలో దర్బార్(సభ) నిర్వహించి అందులో గిరిజనుల సాంస్కృతిక తీరుతెన్నులు, వనదేవతలను పూజించడంలో విశిష్టత, గాంధారి ఖిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. మూడు రోజులపాటు జరిగే జాతరలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన, నాయక్‌పోడ్ సంఘాల నాయకులు పాల్గొననున్నారు.


