జాతరకు ముమ్మర ఏర్పాట్లు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ ఆర్‌కే1ఏ గని సమీపంలోని పాలవాగు ఒడ్డున జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సమ్మక్క–సారలమ్మ కొలువుదీరే గద్దెలకు రంగులు వేసి తీర్చిదిద్దారు. జాతర ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల రాకపోకలకు వీలుగా తాత్కాలిక రోడ్ల నిర్మాణం చేపట్టారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలు అమర్చారు. బుధవారం సాయంత్రం సారలమ్మ, గురువారం సమ్మక్కను గద్దైపె ప్రతిష్టించనున్నారు. మందమర్రిలోని దూలం కనకయ్య ఇంటి నుంచి అమ్మవార్లను జాతర ప్రాంగణానికి ఊరేగింపుగా తరలించనున్నారు. శనివారం దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.


