పత్తి కొనుగోళ్లు
లక్సెట్టిపేట, రేపల్లెవాడలో నేడు ప్రారంభించనున్న కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లాలో 10 సీసీఐ కొనుగోలు కేంద్రాలు తేమశాతం 8 ఉంటే క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర 12 నుంచి 13 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా
నేటి నుంచి
మంచిర్యాలఅగ్రికల్చర్/బెల్లంపల్లి/దండేపల్లి: జిల్లాలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ మూడు వ్యవసాయ మార్కెట్‌యార్డుల పరిధిలో 10 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసింది. చెన్నూర్ పరిధిలో 6, బెల్లంపల్లిలో 3, లక్సెట్టిపేటలో 1 జిన్నింగ్ మిల్లులో ఏర్పాట్లు చేశారు. సోమవారం బెల్లంపల్లి మార్కెట్ పరిధిలోని తాండూర్ మండలంలో రేపల్లెవాడ జిన్నింగ్ మిల్లు, లక్సెట్టిపేట మార్కెట్ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 నుంచి 13 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు కేంద్రాలకు రానున్నట్లు అధికారుల అంచనా.
గతేడాది ఆందోళనలు, రాస్తారోకోలు
గతేడాది 7.58 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పత్తి అమ్ముకునేందుకు అరిగోస పడ్డారు. సీసీఐ నిబంధనతో అవస్థలు పడ్డారు. తేమ, పింజపొడవు తదితర నిబంధనల సాకుతో వారంలో మూడు నాలుగు రోజులు కొనుగోళ్లు నిలిపివేయడంతో పత్తి వాహనాలతో నిరీక్షించారు. డిసెంబర్, జనవరి మాసంలో మిల్లుల్లో పత్తి నిల్వలు పేరుకుపోయి త రచూ కొనుగోళ్లు నిలిపివేయడంతో రాస్తారోకోలు, ఆందోళనలు సైతం చేపట్టారు. కొంతమంది రైతులు సీసీఐ కొర్రీలతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు విక్రయించి నష్టపోయారు.
వర్షాలతో తగ్గిన దిగుబడి
ఈ ఏడాది జిల్లాలో 1.69 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పంట నీటమునిగింది. కొన్నిచోట్ల మొక్కలు జాలువారి దిగుబడి తగ్గింది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 4 నుంచి 5 క్వింటాళ్లకు మించి వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. కనీసం పెట్టుబడి వెళ్తే చాలని సరిపుచ్చుకుంటున్నారు. అరకొరగా వచ్చిన దిగుబడికి సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఏటా సీసీఐకి రైతులు తీసుకువచ్చిన పత్తికి తేమ, పింజపొడవు, తదితర నిబంధనల పేరుతో కొనుగోలు చేయడం లేదు. ఆరంభంలో తేమ 12 శాతం కంటే ఎక్కువగా వస్తుందని కొనుగోలు చేయడం లేదు. గడిచిన నాలుగేళ్లలో డిసెంబర్, జనవరి మాసాల్లో పెద్ద ఎత్తున పత్తి మార్కెట్లకు తరలివచ్చింది. ఈ సమయంలో సీసీఐ తేమ తిరకాసుతో రైతులు వ్యాపారులను ఆశ్రయించి నష్టపోయారు.
నాణ్యమైన పత్తి తీసుకురావాలి
జిల్లాలో సీసీఐ ద్వారా 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయనున్నప్పటికీ నేడు తాండూర్ మండలం రేపల్లెవాడ, లక్సెట్టిపేటలోని జిన్నింగ్ మిల్లులో కలెక్టర్ పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. పత్తి విక్రయించే రైతులు కపాస్ కి సాన్ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. నాణ్యమైన పత్తి తీసుకువచ్చి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర పొందాలి.
– షాబొద్దీన్,
జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అఽధికారి
పత్తికి మద్దతు ధర ఇలా (క్వింటాలుకు)
కొత్త తిప్పలు..
కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ అందుబాటులోకి తీసుకవచ్చింది. పత్తి విక్రయించే రైతులు ముందుగా ఈ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వ్యవసాయ శాఖ ద్వారా సాగు చేసిన పత్తి పంటకు సంబంధించి క్రాప్ బుకింగ్‌లో నమోదు చేసి ఉండాలి. ఆధార్‌కు అనుసంధానంగా ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ లేదా, బయోమెట్రిక్/ ఐరిస్ ద్వారా కూడా ఆధార్ దృవీకరించనున్నారు. రైతులు ఆధార్‌కు అనుసంధానించిన సెల్ నంబర్‌ను యాప్‌లో నమోదు చేసుకుంటే స్లాట్ బుకింగ్ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్‌లో కపాస్ కిసాన్‌యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందులో స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో పత్తి విక్రయించే తేదీ, జిన్నింగ్ మిల్లు కేటాయిస్తారు. అవగాహన లేని రైతులకు ఏఈవోలు, సీసీఐ సిబ్బంది ద్వారా స్లాట్ బుకింగ్ సహకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీఐ నిబంధనల మేరకు 8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయనుంది. 8 శాతం తేమ ఉంటే క్వింటాలుకు రూ.8,110, ఆపై పెరిగితే ఒక్క శాతానికి రూ.81 తగ్గించి ధర చెల్లించనున్నారు.
పత్తి కొనుగోళ్లు


