యాప్‌లో పల్లెల లెక్క
మంచిర్యాలరూరల్(హాజీపూర్):గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీలో మౌలిక వసతులు, ప్రభుత్వ ఆస్తుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు గత నెల 18న చేపట్టిన జీపీ మానిటరింగ్ సర్వే నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో సర్వే జరుగుతోంది. పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడం, నిధుల కొరతతో పలు గ్రామాల్లో సమస్యలు పెరిగిపోవడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ జీపీ మానిటరింగ్ సమాచారంతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేయవచ్చని ప్రభుత్వం సర్వేకు ఉపక్రమించింది.
21 అంశాలపై సర్వే..
జీపీ మానిటరింగ్ యాప్ ద్వారా అన్ని గ్రామాల్లో 21 అంశాలపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ యాప్‌లో పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు. పంచాయతీ భవనం, ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్, పారిశుద్ధ్యం, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ, వైకుంఠధామం, తాగునీరు, వీధిదీపాలు, అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, తదితర ప్రాథమిక వసతు ల వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లోని వసతులతో పాటు ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలు స్పష్టంగా తెలుస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాదు గ్రామాల్లోని ప్రభుత్వ ఆస్తుల వాస్తవ పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలు తెలియడంతో పాటు ఈ సర్వే ద్వారా పంచాయతీలోని సమగ్ర సమాచారంపై పూర్తి అవగాహన వస్తోంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలకు ఈ సర్వే దోహదపడనుంది.
పారదర్శకంగా సర్వే..
గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న జీపీ మానిటరింగ్ యాప్ సర్వే పారదర్శకంగా సాగుతోంది. పంచాయతీల్లోని ప్రభుత్వ ఆస్తులు, మౌలిక వసతులపై సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శులు 21 అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను జీపీ మానిటరింగ్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. సర్వేపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం.
– వెంకటేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి
							యాప్‌లో పల్లెల లెక్క

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
