తేలిన టీచర్ల లెక్క | - | Sakshi
Sakshi News home page

తేలిన టీచర్ల లెక్క

Nov 3 2025 6:22 AM | Updated on Nov 3 2025 6:22 AM

తేలిన టీచర్ల లెక్క

తేలిన టీచర్ల లెక్క

● సర్దుబాటుతో దిద్దుబాటు ● సర్‌ప్లస్‌ 367.. కొరత 96

చెన్నూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 168 మంది విద్యార్థులు ఉన్నారు. ఏడుగురు టీచర్లకుగానూ 14 మంది విధులు నిర్వహిస్తున్నారు.

భీమారం జెడ్పీహెచ్‌ఎస్‌లో 277 మంది విద్యార్థులుండగా 9 మంది పనిచేయాల్సిన చోట 18 మంది టీచర్లు ఉన్నారు.

ఆకెనపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ ఏడుగురు టీచ ర్లు ఉండాల్సిన చోట 12 మంది, సబ్బెపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏడుగురికిగానూ 14 మంది టీచర్లు సర్‌ప్లస్‌ ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది.

జిల్లెడ ఎంపీయూపీఎస్‌లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆరుగురు పనిచేయాల్సిన చోట ఇద్దరు టీచర్లు ఉండటంతో మరో నలుగురు ఉపాధ్యాయుల కొర త ఉంది.

అక్కెపల్లిగూడ ఎంపీపీఎస్‌లో 276 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లే ఉన్నా రు. మరో ఐదుగురు ఉపాధ్యాయులు అవసరముంది.

రేండ్లగూడ ఎంపీపీఎస్‌లో ఏడుగురు టీచర్లు పనిచేయాల్సిన చోట నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

చిత్రంలో కనిపిస్తోంది దండేపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల. ఇందులో 227 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రేషనలైజేషన్‌ (పాఠశాలల హేతుబద్ధీకరణ) మేరకు 8 మంది ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉండగా 22 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈలెక్కన 14 మంది టీచర్లు మిగులు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఈ టీచర్లను అవసరమున్న పాఠశాలలకు సర్దుబాటు చేయనుంది.

మంచిర్యాలఅర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పునర్విభజన, మిగులు పోస్టులను సర్దుబాటుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమిస్తూ విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా 2025–26 విద్యాసంవత్సరంలో టీచర్ల సర్దుబాటు (తాత్కాలిక డిప్యూటేషన్‌) చేసింది. తాజాగా డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాల మేరకు మిగులు టీచర్లు, ఉపాధ్యాయుల కొరత వివరాలు సేకరించి నివేదించింది. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించింది. అవసరం ఉన్న పాఠశాలలకు వర్క్‌అడ్జస్ట్‌ పేరిట మొదటి విడత 73 మంది, రెండో దఫా 19 మంది టీచర్లను సర్దుబాటు చేసింది. మరోసారి ఉపాధ్యాయుల సర్దుబాటుతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

మిగులు 367.. కొరత 96

జిల్లాలో 684 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో ప్రైమరీ స్కూళ్లు 488, యూపీఎస్‌లు 88, ఉన్నత పాఠశాలలు 101 ఉన్నాయి. 30,406 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా 2,474 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న (మిగులు పాఠశాలలు)లెక్క తేల్చారు. మొత్తం 367 మంది మిగులు టీచర్లు (సర్‌ప్లస్‌) ఉన్నట్లు గుర్తించారు. ఇందులో చెన్నూర్‌, దండేపల్లి మండలాల్లో 43 మంది చొప్పున మిగులు ఉన్నట్లు గుర్తించారు. నెన్నెలలో 29, జైపూర్‌లో 26, మంచిర్యాలలో 26, కోటపల్లిలో 25, తాండూర్‌లో 24, హాజీపూర్‌లో 22 మంది సర్‌ప్లస్‌ ఉపాధ్యాయులుండగా మిగిలిన మండలాల్లో నలుగురి నుంచి 20లోపు ఉన్నట్లు విద్యాశాఖ నిర్ధారించింది. విద్యార్థుల ప్రవేశాల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట ఉపాధ్యాయుల కొరత గుర్తించింది. ఆయా పాఠశాలల్లో 96 మంది ఉపాధ్యాయులు అవసరమున్నట్లు తేల్చారు. ఇందులో అత్యధికంగా జన్నారం మండలంలో 17 మంది, మంచిర్యాలలో 14, మందమర్రిలో 12 మంది, మిగిలిన మండలాల్లో 1 నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు కొరత ఉన్నట్లు తేల్చింది. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి ఎక్కువగా ఉన్న పాఠశాలలకు వారిని సర్దుబాటు చేయనున్నారు.

రేషనలైజేషన్‌ ఇలా..

పాఠశాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌) ప్రక్రియలో చైల్డ్‌ఇన్‌ఫోలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ఒకే పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం నిర్వహిస్తున్న చోట 50 మందికిపైగా విద్యార్థులుంటే పూర్తిస్థాయిలో అంటే ఏడుగురు టీచర్లు, ఒక హెచ్‌ఎం, పీఈటీని కేటాయించాలి. మిగిలిన మీడియంకు నాన్‌ లాంగ్వేజ్‌ గణితం, బయోసైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, సోషల్‌ టీచర్‌ను నియమించాలి. ప్రైమరీ, యూపీఎస్‌ పాఠశాలలో 1 నుంచి 10 మంది విద్యార్థులుంటే 1టీచరు, 11 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు, 91 నుంచి 120 మంది ఉంటే నలుగురు, 121 నుంచి 150 ఉంటే ఐదుగురు, 151 నుంచి 200 మంది వరకు ఉంటే ఆరుగురు టీచర్లు అవసరముంటుంది. 6, 7 తరగతులకు 1 నుంచి 20 ఒక లాంగ్వేజ్‌, నాన్‌ లాంగ్వేజ్‌ టీచర్‌, 21 మందిపైన–నాలుగు సబ్జెక్టు టీచర్లను నియమించాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలలో 220 మంది వరకు విద్యార్థులు ఉంటే ఏడుగురు టీచర్లు, 221 నుంచి 250 వరకు ఉంటే 8, 251 నుంచి 280 వరకు ఉంటే 9, 281 నుంచి 310 వరకు ఉంటే 10, 311నుంచి 340 వరకు ఉంటే 12, 671 నుంచి 700 వరకు ఉంటే 24 మంది ఉపాధ్యాయులను కేటాయిస్తారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువ టీచర్లు ఉండగా, మరికొన్నింట్లో విద్యార్థుల సంఖ్య కంటే తక్కువగా ఉన్నారు.

మచ్చుకు కొన్ని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement