బియ్యం మారినా.. దందా ఆగలే!
నాడు దొడ్డు బియ్యం.. నేడు సన్న బియ్యం.. కిలోకు రూ.18తో కొనుగోలు దర్జాగా పీడీఎస్ బియ్యం పక్కదారి ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు
మంచిర్యాలక్రైం: గత ప్రభుత్వాలు పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేసిన రేషన్ (దొడ్డు) బి య్యం తినడానికి యోగ్యంగా లేకపోవడంతో రా ష్ట్రంలో 90 శాతం మంది ప్రజలు వాటిని దళారుల కు అమ్ముకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొడ్డు బియ్యం ఎవరూ తినడం లేదని ఈ ఏడాది మే నెలలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రారంభంలో బాగానే ఉన్నా ఆతర్వాత అన్నం మెత్తగా అవుతోందని, ఇసుక ఉంటోందని జిల్లాలో 70 శాతం మంది లబ్ధిదారులు సన్నబియ్యం అమ్ముకుంటున్నారు. ధళారులు వీధుల గుండా తిరుగుతూ కిలోకు రూ.18 చొప్పున కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది మే నుంచి అక్టోబర్ వరకు 20 కేసులు నమోదు కాగా 208.31 క్వింటాళ్ల రేషన్‌బియ్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సన్నబియ్యం అక్రమ రవాణపై సివిల్ సప్‌లై అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
మళ్లీ అదే దందా.. అదే జోరు..
గతంలో 90 శాతం మంది ప్రజలు ఉచితంగా వచ్చిన రేషన్ బియ్యాన్ని కిలోకు రూ.12 నుంచి 14 వరకు దళారులకు విక్రయించేవారు. ఇదే అదనుగా భావించిన రేషన్ డీలర్లు సైతం లబ్ధిదారులతో వేలిముద్రలు వేయించుకుని నగదు చెల్లించేవారు. దళారులు ప్రస్తుతం ఒకరు రూ.18 చెల్లిస్తుంటే మరొకరు పోటీగా రూ.20 పెట్టి వాడల్లో తిరుగుతూ సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. కొందరు మహారాష్ట్రలోని సిరోంచకు, మరికొందరు స్థానికంగా, ఇతర ప్రాంతాల రైస్‌మిల్లులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కొందరు రేషన్ డీలర్లు సైతం మళ్లీ దళారుల అవతారమెత్తి దర్జాగా దందా సాగిస్తున్నట్లు సమాచారం.
సగానికిపైగా అనర్హులే...
జిల్లాలో 423 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతీనెల జిల్లాకు 9 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బి య్యం పంపిణీ చేస్తోంది. ఇందులో సగానికిపైగా అ నర్హత కలిగిన కుటుంబాలు ఉండడం గమనార్హం. రేషన్ కార్డు బహుళ ప్రయోజన కారి కావడంతో నిరుపేదలతో పాటు ఆదాయ వర్గాలు సైతం పెద్దఎత్తున కార్డులు పొందారు. వారికి పీడీఎస్ బియ్యం అవసరం లేకపోయినప్పటికీ కేవలం తమ రేషన్ కార్డు రద్దు కాకుండా యాక్టివ్‌గా ఉండేందుకు అప్పుడప్పుడు బియ్యం కోటా డ్రా చేస్తున్నారు. ఎవరైన సన్నబియ్యం అమ్ముకుంటే వారిని గుర్తించి రేషన్‌కా ర్డు రద్దు చేస్తామని ఓ వైపు అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా దందా ఆగడం లేదు.
సరిహద్దులో నిఘా కరువు...
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన రాపనపల్లి ప్రాణ హిత నదిపై నిర్మించిన అంతర్రాష్ట్ర రహదారి అక్ర మ రవాణాకు వారధిగా మారింది. మంచిర్యా ల నుంచి మహారాష్ట్రకు డీసీఎం, ఆటోలు, ట్రాలీ ఆటో ల ద్వారా రాత్రి పగలు తేడాలేకుండా యథేచ్చగా రేషన్‌బియ్యం తరలిస్తున్నారు. గతంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ పోలీ సులు ప్రత్యేక టీంగా ఏర్పడి అక్రమ రవాణా, చ ట్ట వ్యతిరేఖ కార్యక్రమాలపై నిఘా పెట్టి వరుస దాడులు నిర్వహించారు. ప్రస్తుతం టాస్క్‌ఫోర్ బృందం లేకపోవడంతో అంతర్రాష్ట్ర వారధిపై నిఘా వైఫల్యం వల్లే అక్రమ రవాణా దందా యథేచ్చగా సాగుతోంది. ప్రతీరోజు జిల్లా నుంచి మహారాష్ట్రకు సుమారు రూ.కోటి విలువైన బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఏదైనా సమాచారం ఉంటే తప్ప పోలీసులు తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అడపాదడపా చేసిన దాడుల్లోనే క్వింటాళ్ల కొద్దీ బియ్యం పట్టుబడడం గమనార్హం. రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టడంలో పౌరసరఫరాల శాఖ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ రవాణాపై నిఘా...
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాం. బియ్యం అమ్మిన వారి రేషన్‌కార్డు రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తున్నాం. అక్రమ రవాణా ఏదైనా సరే వదిలిపెట్టిది లేదు. ఇప్పటికీ చాలా కేసులు నమోదు చేశాం. అదే వృత్తిగా మలచుకుని దందా కొనసాగిస్తున్న కొందరిని గుర్తించాం. త్వరలో వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తాం. బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రజలు సహకరించాలి. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల


