
పౌష్టికాహార లోపం నివారణకు దత్తత
పాతమంచిర్యాల: అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని పిల్లలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి గ్రామీణాభివృద్ధి శాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. స్వచ్ఛంద పోషకాహార వస్తువుల సేకరణ చేపట్టనుంది. జిల్లాలో 468 గ్రామైక్య సంఘాలు ఉండగా.. వీటి పరిధిలో స్వయం సహాయక సంఘాలు 10,629 ఉన్నాయి. వీటిల్లో 1,10,810 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారలోపం, సరైన ఎదుగుదల లేని ఇద్దరు పిల్లలను గ్రామాల్లోని స్వయం సహాయక సంఘం దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా సంఘాల్లోని సభ్యులు తమకు తోచిన విధంగా పిల్లలకు గుప్పెడు బియ్యం, పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, ఆకుకూరలు ఇతరత్రా ఏమి ఇవ్వాలనుకున్నారో వాటిని గ్రామైక్య సంఘానికి అప్పగించాల్సి ఉంటుంది. వాటిని అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పిల్లల తల్లిదండ్రులకు అప్పగిస్తారు. పేదరికం కారణంగా సరిగా తిండి లేని పిల్లలకు ఉపయోగకరంగా ఉండేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
పిల్లల గుర్తింపు
జిల్లాలో 969 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. పేద కుటుంబాల్లోని ఐదేళ్లలోపు పిల్లలు ఆడ, మగ పౌష్టికాహారం సరిగా అందక వ్యాధినిరోధకత లోపించడం, ఎదుగుదల సరిగా లేకపోవడం, బరువు తక్కువగా ఉండడం, ఉండాల్సిన ఎత్తుకంటే తక్కువగా ఉన్నవారిని జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల నివేదికల ప్రకారం గుర్తిస్తా రు. ఇప్పటివరకు గ్రామాల్లో పౌష్టికాహార లోపం గల ఐదేళ్లలోపు పిల్లలు 345మంది ఉన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లోని పిల్లలను గుర్తించాల్సి ఉంది.
సంఘాల సభ్యులకు అవగాహన
ఆరోగ్యవంతులైన పిల్లలను తయారు చేయడానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు జిల్లాలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ గ్రామ సంఘం ఇద్దరు పిల్ల లను దత్తత తీసుకుని వారికి ఎనిమిదేళ్లు వచ్చే వరకు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. బియ్యం, పప్పులు, పండ్లు, కూరగాయలు, గుడ్లు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆరోగ్యవంతులుగా
తీర్చిదిద్దడమే లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన పిల్లల్లో చాలావరకు పౌష్టికాహారం అందడం లేదు. పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల సరిగా లేక వ్యాధులబారిన పడడం, ఎదుగుదల సమస్యలతో బాధపడుతున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో పౌష్టికాహార లోపం గల పిల్లలను దత్తత తీసుకుని మంచి పోషకాలు కలిగిన ఆహారం అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతాం.
– ఎస్.కిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, మంచిర్యాల