
జన్నారం అందాలు చూసొద్దాం..
జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌లో అందాలు ఆస్వాదిస్తూ.. వన్యప్రాణులు, రకరకాల పక్షులు, జంగిల్ సఫారీ ప్రయాణం ద్వారా పర్యాటకులు వీక్షించేందుకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టడడంతో సఫారీ ప్రయాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. మూడు నెలల విరామం తర్వాత అక్టోబర్ 1 నుంచి జంగిల్ సఫారీ మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వచ్చి అడవులు చూసి మురిసిపోతున్నారు. పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం మధ్య గడుపుతున్నారు. వీకెండ్ రోజుల్లో గదులు ఫుల్‌గా ఉంటున్నాయని పర్యాటక అధికారులు పేర్కొంటున్నారు.
15 రోజుల్లో 600 పైగా మంది
జంగిల్ సఫారీ మొదలైన 15 రోజుల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 600 పైగా మంది పర్యాటకులు ఇక్కడకు వచ్చారని అధికారులు తెలిపారు. నిజామాబాద్, హైదరాబాద్ నుంచి బస్సుల్లో వచ్చి ఇక్కడ సందడి చేస్తున్నారు. రాత్రి హరిత రిసార్ట్‌లో బస చేసి ఉదయం జంగిల్ సఫారీ ద్వారా వన్యప్రాణుల పరుగులు, పచ్చని అడవులను అస్వాదిస్తున్నారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన బేస్‌క్యాంపు, అధ్యయన కేంద్రాలను పరిశీలిస్తున్నారు. అడవుల్లో నిర్మించిన కుంటల్లో పక్షుల కిలకిలలు చూసి మురిసిపోతున్నారు. చెడిపోయిన దారులు..
గేట్ నంబర్ 1 నుంచి సుమారు 15 కి.మీ దూరం సఫారీ ప్రయాణం ఉంటుంది. గొండుగూడ బేస్‌క్యాంపు, బైసన్‌కుంట ప్రాంతాల్లో చుక్కల దుప్పులు, నీలుగాయిలు, అడవి దున్నలు, రకరకాల పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో సఫారీ దారి చెడిపోయినట్లు పర్యాటకులు పేర్కొంటున్నారు. అటవీశాఖ దృష్టిసారించి సఫారీ దారిని బాగు చేయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు సైతం కల్పించాలని కోరుతున్నారు.

జన్నారం అందాలు చూసొద్దాం..