
వార్డెన్ ఆత్మహత్యాయత్నం
లక్సెట్టిపేట:మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన రాజగోపాల్ ఈనెల 18న సాయంత్రం తన ఇంటి వద్ద యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 17న ఇంటికి వెళ్లిన రాజగోపాల్... 18వ తేదీ సాయంత్రం బాత్‌రూంలోకి వెల్లి యాసిడ్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్యను 100 నుంచి 252కి పెంచేలా రాజగోపాల్ కృషి చేశాడు. అయితే ఆమేరకు బిల్లులు రాకపోవడంతో రూ.7 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలిపారు. అయినా బిల్లులు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. దీనిపై సంక్షేమ శాఖ ఉప సంచాలకులు చాతరాజు దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం నిర్మల్‌కు వెళ్లి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. ఏఎస్‌డబ్ల్యూవో సురేశ్‌ను వివరణ కోరగా ఈనెల 17న తన తల్లి ఆరోగ్యం బాగాలేదని రాజగోపాల్ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు.