
పంటలపై పందుల దాడి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన అన్నదాతలను ఇప్పుడు అడవిపందులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట ఎదుగుదల, పూత, కాత సమయంలో కురిసిన భారీ వర్షాలు జిల్లాలోని వేలాది ఎకరాల్లో పంటను నీటముంచాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినా కాత, దిగుబడి దశలో ఉన్న ప త్తి, పొట్ట, గింజ పాలు పోసుకునే దశలో ఉన్న వరి పంటలపై అడవిపందులు ధ్వంసం చేస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు చీరెలు, ప్లా స్టిక్ కవర్లు, సంచులు, బెదురు బొమ్మలు, ఇనుప డ బ్బాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పాటు పంటచేల వద్ద మంటలు వేసుకుని కాపలా ఉంటున్నారు. కేకలు వేస్తూ, ఇనుపడబ్బాలు చప్పుడు చే స్తూ, టపాకాయలు కాలుస్తూ వాటిని బెదిరిస్తున్నా రు. అయినా బెదరని పందులు పదుల సంఖ్యలో పంటచేలలోకి ప్రవేశించి చేనంతా నేలమట్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో అడవిపందులు రైతులపైనా దాడి చేసి గాయపర్చిన ఘటనలున్నాయి.
వేల ఎకరాల్లో నష్టం
జిల్లాలో ఈ ఏడాది రైతులు 3.21 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో 1.61 లక్షల ఎకరాల్లో పత్తి, 1.57 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గత ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షాలు, ఈ నెల అల్పపీడన ప్రభావంతో వేలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం రైతులు పత్తి ఏరేందు కు సిద్ధమవుతున్నారు. వరి గొలుసు పట్టి గింజపాలు పోసుకుంటోంది. ఈ సమయంలో అడవిపందుల దాడి విపరీతంగా పెరిగింది. రాత్రి సమయంలో పత్తిచేలల్లోకి దూరి కాయలు తింటూ చెట్లను తొక్కుతూ నేలమట్టం చేస్తున్నాయి. వరి గొలుసులు తింటూ కర్రలను బురదలో తొక్కుతున్నాయి. పచ్చగా ఉన్న పంట పొలాలను తెల్లారేసరికి బురదమడుగులా తయారు చేస్తున్నాయి. దీంతో పంట నష్టపోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా..
అడవిపందుల బారినుంచి పంటలను రక్షించుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నా రు. ఒక్కో చీరెకు రూ.20 నుంచి రూ.30కి వెచ్చించి వందలసంఖ్యలో తెచ్చి పత్తి, వరి పంటల చుట్టూ కడుతున్నారు. దీంతో పాటు బెదురు బొమ్మలు, ప్లా స్టిక్ సంచులు, ఇనుప డబ్బాలు కడుతూ అడవిపందులను బెదరగొట్టేందుకు అష్టకష్టాలు పడుతున్నా రు. అయినప్పటికీ అడవిపందుల దాడులు ఆగడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం రాయితీపై వివిధ వ్యవసాయ పనిముట్లు అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా రాయితీపై తమ కు సోలార్ కంచెలు అందించి పంటలను వన్యప్రాణుల నుంచి కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు నష్టపోయిన పంటలకు పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.