
అక్రమ కేసులతో గొంతునొక్కే కుట్ర
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రజాసమస్యలను ఎత్తిచూపుతూ నిరంతరం అక్షరయజ్ఞం చేస్తున్న సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి గొంతునొక్కే కుట్ర చేస్తోందని జర్నలిస్టు సంఘాల నాయకులు విమర్శించారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై వరుస కేసులు, విచారణ పేరిట వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులతో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు డేగ సత్యం, ప్రధాన కార్యదర్శి పింగిళి సంపత్‌రెడ్డి మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛపై దాడి రాజ్యాంగ హక్కుల ఉల్లంఘననే అని అన్నారు. నకిలీ మద్యంపై రాసిన కథనాలపై చంద్రబాబు ప్రభుత్వం దమనకాండ ప్రదర్శించడం దారుణమని అన్నారు. సాక్షి ఎడిటర్‌తోపాటు జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి బ్యారో ఆకుల రాజు, ఐజేయూ సభ్యుడు కాచం సతీశ్, టీయూడబ్ల్యూజే కోశాధికారి కేశెట్టి వంశీకృష్ణ, ఉపాధ్యక్షులు టి.రవిరాజ్, సురేశ్‌చౌదరి, కార్యనిర్వాహక అధ్యక్షుడు దేవరాజ్, కల్వల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు అర్షణపల్లి రాజేశ్, ఉదయ్‌కుమార్, నస్పూర్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు భూపతి రవి, జర్నలిస్టులు చొక్కారపు శ్రీనివాస్, నేరెళ్ల రమేశ్, పూరెళ్ల పోచమల్లు, రాజలింగు, బాబూరావు, శ్రీధర్, నరేశ్, గజానంద్, ప్రజా సంఘాల నాయకులు గుమ్ముల శ్రీనివాస్, దేవి పోచం పాల్గొన్నారు.