
వేటకు అమర్చిన విద్యుత్ తీగ తగిలి ఒకరు మృతి
పెంబి: వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ తీగ తగిలి ఒకరు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఖానాపూర్ సీఐ అజయ్, ఎస్సై హన్మాండ్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెంబితండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఆక్టోనిమాడ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు పస్పుల తండా గ్రామానికి చెందిన ఆత్రం రాజు ఈ నెల 11న విద్యుత్ తీగ ఏర్పాటు చేశారు. దాదాపుగా 400 మీటర్ల దూరం విద్యుత్ కంచె అమర్చాడు. పెంబిలో మేకల కాపరిగా పనిచేస్తున్న ఆక్టోనిమాడ గ్రామానికి చెందిన ఆత్రం లింబారావు (29)శనివారం సాయంత్రం మేకలను కొట్టంలోకి పంపి ఇంటికి బయల్దేరాడు. ఆదివారం ఉదయం మేకలను తీసుకెళ్లేందుకు లింబారావు రాకపోవడంతో యజమాని కుటుంబ సభ్యులను ఆరా తీశాడు. శనివారం సాయంత్రం ఇంటికి కూడా రాలేదని చెప్పడంతో ఆందోళన చెందిన యజమాని, బాధిత కుటుంబ సభ్యులు సమీప ప్రాంతంలో వెతికారు. గ్రామానికి చెందిన పశువుల కాపరికి కాలిపోయిన మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా లింబారావుగా గుర్తించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. విద్యుత్ కంచె ఏర్పాటు చేసిన రాజు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.