
ఆదాయం ఉన్నా బస్సుల్లేవు..!
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఉన్న ఏకై న బస్సు డిపో మంచిర్యాలకు బస్సుల కేటాయింపు అంతంత మాత్రంగానే ఉంది. ఆర్టీసీకి ఆదాయం తెస్తున్నా బస్సుల మంజూరులో ఆలస్యం జరుగుతోంది. రద్దీ రూట్లలో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ బస్సులూ తక్కువే ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల శకం మొదలైనా మంచిర్యాల డిపోకు కేటాయింపుపై ఊసే లేకుండా పోయింది. వాయుకాలుష్యంతో పర్యావరణానికి ఇబ్బంది కలిగించే వాహనాల స్థానంలో ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా డిపోలకు కేటాయించారు. జిల్లాకు ఒక్కటి కూడా చేరలేదు. ఇందిర మహిళా శక్తి పథకంలో అందించే బస్సుల కోసమూ అతివల ఎదురుచూపులు తప్పడం లేదు.
రద్దీ రూట్లలో కొరత
ప్రయాణికుల రద్దీ రూట్లలో బస్సుల కొరత ఏర్పడుతోంది. చెన్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ రూట్ల లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. బస్సుల్లో గంటల త రబడి నిల్చుని కిక్కిరిసి ప్రయాణిస్తుంటారు. హైదరాబాద్‌కు 44 లగ్జరీ, లహరీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చి న తర్వాత ఏమో గానీ ఎక్స్‌ప్రెస్ బస్సులను కుదించారు. తెల్లవారు జామున 3.45గంటలకు తప్పితే సాయంత్రం 7గంటలకు వరకు బస్సులు కనిపించవు. దీంతో మహిళలు గోదావరిఖని, కరీంనగర్ వరకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఎక్స్‌ప్రెస్ బస్సుల సంఖ్య పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. పండుగ వేళ రద్దీ ఎక్కువగా ఉండడం.. అదే తీరున డిపోకు ఆదాయం సమకూరుతోంది. రాఖీ పండుగ వేళ నాలుగు రోజులపాటు 3.31లక్షల కిలోమీటర్లు బస్సులు తిప్పగా రూ.2.13కోట్ల ఆదాయం సమకూరింది. దసరా, బతుకమ్మ కోసం సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 6వరకు ప్రత్యేక బస్సులతో భారీగా ఆదాయం వచ్చింది. 198 ప్రత్యేక బస్సులు 59,536 కిలోమీటర్లు నడపడం ద్వారా 23,655 మంది ప్రయాణికులను చేరవేశారు. రూ.62,70,066 ఆదాయం సమకూరడంతో మిగతా డిపోల కంటే ముందుస్థానంలో నిలిచింది. పండుగలు, పర్యాటక సీజన్లతోపా టు ఉచిత ప్రయాణికులతో రద్దీగా మారుతోంది. కొత్త బస్సులు వస్తే కొంత మేర ఒత్తిడి తగ్గుతుంది.
‘ఈవీ’లు వచ్చేదెన్నడో..!
ఈవీ బస్సుల శకం మొదలైనా డిపోకు కేటాయింపు జరగలేదు. ఇబ్బందులు లేని ప్రయాణం, ఇంధన ఖర్చు ఆదాతోపాటు ఈ బస్సుల వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. ఆయా డిపోలకు బస్సులు మంజూరు చేసినా ఇక్కడి ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అప్పట్లో బస్సుల చార్జింగ్‌కు ప్రతిపాదనలు చేసినా ఊసే లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ద్వారా ఇందిర మహిళా శక్తి పథకంలో మహిళా సంఘాల సభ్యులకు ఆర్టీసీ బస్సులు అందజేస్తోంది. ఈ పథకంలో మండల సమాఖ్యకు అద్దె బస్సుల కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదికలు అందించారు. అయినా ఆమె చేతికి ప్రగతిచక్రాలు చేరలేదు. దీంతో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు కాలేకపోతున్నారు. ఈవీ బస్సులతోపాటు మహిళా సమాఖ్యలకు బస్సులు కేటాయిస్తే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా మారనుంది.
40ఏళ్లలో 29..
మంచిర్యాల డిపో 1975లో ఫిబ్రవరి 6న ఏర్పా టు చేశారు. అదే సమయంలో బస్‌స్టేషన్‌లో తొమ్మిది ప్లాట్‌ఫారాలు, 32 బస్సులతో ప్రారంభించారు. 3.21 ఎకరాల్లో డిపో, 1.34 ఎకరాల్లో బస్టాండ్ నిర్మించారు. 1985 నాటికి 32 బస్సుల సంఖ్యను 118కి పెంచగా.. ప్రస్తుతం డిపో పరిధి లో 147 ఉన్నాయి. ఈ లెక్కన 40ఏళ్ల(1985నుంచి)లో 29 బస్సులు మాత్రమే డిపోకు కేటాయించారు. ఏడాదికి ఒక్క బస్సు కేటాయించినా 40బస్సులు రావాల్సి ఉండగా.. వివక్ష చూపినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా బస్సుల సంఖ్య పెరగకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మంచిర్యాల బస్టాండ్ మీదుగా రోజుకు 62వేల కిలోమీటర్ల మేర బస్సులు నడపడం ద్వారా రూ.34లక్షల నుంచి రూ.36లక్షల(మహాలక్ష్మి పథకం కలిపి) వరకు ఆదాయం సమకూరుతుంది. ఏళ్ల తరబడి బస్టాండ్ విస్తరించకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. 1985లో నిర్మించిన తొమ్మిది ప్లాట్‌ఫారాలు మినహా ఒక్కటి కూడా అదనంగా ఏర్పాటు కాకపోవడంతో బస్సులు నిలిపేందుకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి.