
కొత్తవారికే డీసీసీ పీఠం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షులుగా కొత్తవారికే అవకాశం దక్కనుంది. పార్టీ అధిష్టానం విధించిన నియమాలే అందుకు కారణమని స్పష్టమవుతోంది. వరుసగా ఐదేళ్లపాటు పార్టీలో పని చేసిన కార్యకర్తలు, నాయకులు డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కనీస అర్హతగా నిర్ణయించారు. అంతేగాక ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నవారికి మరోసారి ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధువులకు కాకుండా పార్టీలోని ఇతరులకే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో సీనియర్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. ఈ మేరకు ఏఐసీసీ పరిశీలకులు, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్‌చార్జి డాక్టర్ నరేశ్‌కుమార్ ఒక్కొక్కరి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులుగా పోటీ చేసే వారు పార్టీలో తమ సీనియార్టీతో కూడిన బయోడేటాను పరిశీలకులకు అందజేస్తున్నారు.
ఢిల్లీ నుంచే ఎంపిక
గతంలో మాదిరిగా కాకుండా ఈసారి డీసీసీ అధ్యక్ష ఎన్నికల్లో కీలక మార్పులు చేశారు. స్థానికంగా పార్టీ ప్రాధాన్యతలు దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేస్తున్నారు. గతంలో ప్రజాప్రతినిధులు, గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రుల ఎంపికనే తుది నిర్ణయంగా ఉండేది. ఈసారి ఐదేళ్లు పార్టీ కోసం పని చేసిన వారిని అధ్యక్ష పదవికి అర్హులుగా పరిగణించి వారందరి నుంచి అర్జీలు తీసుకుని పరిశీలకులతో అభిప్రాయాలు సేకరించి ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవి దక్కేలా అందరినీ దృష్టిలో పెట్టుకుని జిల్లాకు కనీసం ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను ఢిల్లీకి పంపిస్తే అక్కడ అన్ని రకాలుగా పరిశీలించి ఎంపిక చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ పరిశీలకులు జాబితా మాత్రమే రూపొందించి.. ఫైనల్ చేయడం మాత్రం అధిష్టానం చేతిలో పెట్టారు.
మద్దతు దక్కితేనే పదవి
డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లా నుంచి అనేక మంది పోటీలో ఉంటున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌తో పాటు ఖానాపూర్(జన్నారం మండలం) పరిధిలోని నాయకులు ఈ మేరకు అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో తమ పరిధిలో ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రితో కార్యకర్తలు, నాయకులు మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న జనరల్ కేటగిరీతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, యువజన విభాగం నుంచి పలువురు పోటీ పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది నుంచి మద్దతు దొరికి ఎవరిని పదవి వరిస్తుందోనని పార్టీలో ఆసక్తి రేపుతోంది.
పారదర్శకంగా అధ్యక్షుడి ఎన్నిక : ఏఐసీసీ పరిశీలకులు
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ పరిశీలకులు డాక్టర్ నరేశ్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని నార్త్‌ఇన్ హోటల్‌లో పీసీసీ ఆర్గనైజర్లు అడువాల జ్యోతి, బత్తిని శ్రీనివాస్‌గౌడ్, పులి అనిల్‌కుమార్, గిరిజన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక విజయ్‌కుమార్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా అధ్యక్ష పదవుల ఎంపిక జరుగుతోందని, అలాగే రాష్ట్రంలో చేపడుతున్నామని తెలిపారు. మొదట అధ్యక్ష, తర్వాత బ్లాక్, బూత్ స్థాయిలో నియామకాలు ఉంటాయన్నారు. పార్టీ కోసం పని చేసేవారికే అధ్యక్ష పదవి దక్కుతుందన్నారు. అధ్యక్ష ఎంపికలో స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పరిశీలించి అధిష్టానానికి పంపుతామని అన్నారు. ఆసిఫాబాద్‌లో జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న వారితో ఒక్కొక్కరిగా మాట్లాడినట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాల్లోనూ అభిప్రాయాల సేకరణ చేపడతామని తెలిపారు. వచ్చే ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో కొత్తగా ఎంపికై న డీసీసీ అధ్యక్షులు ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపారు. అధ్యక్ష పదవికి కోసం దరఖాస్తులు అందజేయగా.. పార్టీ నుంచి కేవీ.ప్రతాప్, దయానంద్, డా.నీలకంఠేశ్వర్‌రావు, నూకల రమేశ్, గడ్డం త్రిమూర్తి తదితర నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్‌లో మంచిర్యాల నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో ఏఐసీసీ అబ్జర్వర్, పీసీసీ ఆర్గనైజర్లు సమావేశం అయ్యారు.