
మహిళా శక్తి భవన్ పనులు పూర్తి చేయాలి
మంచిర్యాలటౌన్/చెన్నూర్/కోటపల్లి: మంచిర్యాలలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన భవన నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం రుణ సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. చెన్నూర్ మండలం కిష్టంపేట, చెన్నూర్ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, 2.0 వాటర్ ట్యాంకు పనుల పురోగతి పరిశీలించారు. చెన్నూర్‌లో మూత్రశాలలు వెంటనే నిర్మించాలని, తాగునీటి ట్యాంకు నిర్మాణం పూర్తి చేసి ఇంటింటికీ నీటి సరఫరా చేయాలని సూచించారు. కోటపల్లిలో గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్, కమిషనర్ మురళికృష్ణ పాల్గొన్నారు.