
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
దండేపల్లి: మండలంలోని మేదరిపేట వద్ద బుధవారం బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో నాగసముద్రం గ్రామానికి చెందిన సిద్దార్థ అనే యువకుడి కుడికాలు విరిగింది. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన చోట రోడ్డుపై గుంతలు ఉండడంతో తరుచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో ఒకరికి..
తానూరు: మండలంలోని సింగన్‌గాం గ్రామంలో బుధవారం సాయంత్రం విద్యుదాఘాతంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అశోక్ పటేల్ గ్రామంలో పిండిగిర్ని నడిపిస్తూ ప్రైవేట్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇంట్లో విద్యుత్ సమస్య రావడంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేపట్టే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు తానూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భైంసాలోని ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం నిజామాబాద్‌కు తరలించారు. ఈ విషయమై లైన్‌మెన్ రాజన్నను వివరణ కోరగా ఎల్‌సీ తీసుకోకుండా మరమ్మతులు చేపట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు.
ప్రహరీ కూలి 15 మేకలు మృతి
చెన్నూర్: చెన్నూర్ రజకవాడలో ప్రమాదవశాత్తు ప్రహరీ కూలిన ఘటనలో 15 మేకలు మృతి చెందాయి. కాలనీవాసులు తెలిపిన వివరాలు.. రజక కులానికి చెందిన సమ్మయ్య కుల వృత్తిని వదిలి మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. సమ్మయ్యకు 20 మేకలు ఉండగా పట్టణానికి చెందిన మరికొంత మంది మేకలను కాస్తున్నాడు. ఇందుకు ఒక పాత ఇంటి ఆవరణను అద్దెకు తీసుకున్నాడు. వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు మట్టిగోడలు తడిసి ఉండడంతో బుధవారం ప్రహరీ కూలి 15 మేకలు మృతి చెందగా ఆరు మేకలకు గాయాలయ్యాయి. సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సంఘటన స్థలాన్ని రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ అజీజ్ సందర్శించి పంచనామా చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.