
నవోదయ దరఖాస్తులకు గడువు పొడిగింపు
కాగజ్‌నగర్‌టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈనెల 21 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 –27 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతికి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతి చదువుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు ఎడిట్ చేసుకోవచ్చని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పులిదాడిలో గేదె మృతి?
కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ మండలంలోని అనుకోడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో రైతు బైరీ గోపికి చెందిన గేదె బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గేదె మృతికి పులి దాడే కారణమా లేదా ఇతర జంతువులు దాడి చేశాయా అన్న విషయం తెలియరాలేదు. ఈ విషయంపై అటవీశాఖ అధికారి శశిధర్‌బాబును ఫోన్‌లో సంప్రదించగా వివరాలు దాటవేశారు.
మర్లపల్లి అడవుల్లో
చిరుత సంచారం
బోథ్: మండలంలోని మర్లపల్లి శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం మర్లపల్లి గ్రామ సమీపంలో చిరుత ఆవుపైన దాడి చేసింది. ఆవుపై చిరుత దాడి చేసిన సీసీ ఫుటేజీ అటవీ అధికారులకు చిక్కింది. వృద్ధులు, చిన్నపిల్లలు, రైతులు అడవుల్లోకి వెళ్లకూడదని ఎఫ్‌ఆర్‌వో ప్రణయ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
గంజాయి విక్రయదారుడి అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని సాత్నాల క్వార్టర్స్ ఆవరణలో గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ సునీ ల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని బొక్కల్‌గూడకు చెందిన మహ్మద్ అవేజ్ వద్ద 15 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు పేర్కొన్నారు.

నవోదయ దరఖాస్తులకు గడువు పొడిగింపు