
అవిశ్రాంత స్విమ్మర్లు!
ప్రత్యేకత చాటుతున్న సీనియర్ సిటిజన్లు ఏడు పదుల వయసులోనూ ఈత రోజూ ఉదయం గొలుసుకట్టు చెరువులో సరదాగా.. ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం వారి సొంతం
సాధారణంగా 50 వయసు దాటిందంటేనే బీపీ, షుగర్ వంటి కాలానుక్రమ వ్యాధులు వచ్చేసి ఓ చిన్నపాటి నిరుత్సాహం ఆవహిస్తుంది. కానీ బంగల్‌పేట్ చెరువులో దాదాపు 15 నుంచి 20 మంది సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఉల్లాసంగా, ఉత్సాహంగా, హుషారుగా చెరువంతా కలియదిరుగుతూ కిలోమీటర్ల మేర పరిధిలో ఈత కొడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. చెరువు ఆవల ఒడ్డుకు అటు నుంచి ఇవతలి ఒడ్డుకు అవలీలగా చేరుకుంటున్నారు. ఈత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రతీరోజు వీరంతా నిర్ణీత సమయానికి బంగల్‌పేట్ చెరువుకు చేరుకుని స్విమ్మింగ్ ఆస్వాదిస్తున్నారు. పట్టణంలోని రాజేందర్, మల్లేశ్, సాయిసూర్య, శంకర్, నర్సయ్య, శ్రీనివాస్, కిషన్, సుధాకర్, శ్రీనివాసాచారి, లింగం, నారాయణ తదితరులు స్విమ్మింగ్‌పై ఇప్పటి యువతకు అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆసనాలు, సూర్య నమస్కారాలు చేస్తూ ఆరోగ్యంపై చైతన్యం పెంపొందిస్తున్నారు. ఈతతో శారీరకంగా, మానసికంగానూ బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, ప్రతీరోజు ఈత తమ దినచర్యలో భాగమైపోయిందని వీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వారంతా ఏడు పదుల వయసుకు కాస్త అటుఇటుగా ఉన్న వారే. సాధారణంగా ఇలాంటి వారికి ఆరోగ్యం కోసం ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నడక మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఈ సీనియర్ సిటిజన్లు మాత్రం ఉదయం తెల్లవారుజామునే ప్రకృతి సిద్ధమైన చెరువులో ఈత కొడుతూ హుషారైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్ చెరువు విస్తీర్ణంలోనూ అత్యంత విశాలమైనది. అన్ని కాలాల్లో సమృద్ధిగా నీరు ఉంటుంది. ఇక్కడ ఉదయం వేళ 70 ఏళ్లకు చేరువగా ఉన్న వారు హుషారుగా ఈత కొడుతున్న
దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి.
– నిర్మల్‌ఖిల్లా

అవిశ్రాంత స్విమ్మర్లు!