
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత వారం జిల్లా పోలీసు సైబర్ కార్యాలయానికి 15 ఫిర్యాదులు అందాయని, సోషల్ మీడియాలో ఆఫర్ల పేరిట తక్కువ రేటుకు దుస్తులు అందజేస్తామని జరిగే మోసాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సై బర్ నేరాలు జరిగిన వెంటనే 1930కు, సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతీ వారం జిల్లా సైబర్‌క్రైమ్ బృందంతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ వారియర్ ఏర్పాటు చేసి సైబర్ నేరాలపై విద్యార్థులు, ప్రజ లకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో నమోదైన కేసుల వివరాలు..
రూ.5 నోటుకు 5 పైసల నాణేనికి రూ.99 లక్షలు ఇస్తామని నమ్మబలికి తలమడుగు మండలంలోని ఓ వ్యక్తి వద్ద నుంచి దాదాపు రూ.8వేలు దోచుకున్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో దసరా ఆఫర్ పేరిట తక్కువ రేటుకే ఎక్కువ దుస్తులు ఇస్తున్నామని మావల మండలానికి చెందిన బాధితురాలి వద్ద నుంచి రూ.6200 తిరస్కరించారు. తక్కువ వడ్డీ రేటుకు లోన్ ఇస్తామంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడిని మోసం చేయగా, బాధితుడు విడతల వారీగా సైబర్ నేరగాళ్లకు దాదాపు రూ.14వేలు చెల్లించాడు. ఇచ్చోడ నుంచి ట్రాన్స్‌పోర్ట్ కావాలని ఆన్‌లైన్‌లో వెతకగా నకిలీ కస్టమర్‌కేర్ వ్యక్తులు బాధితుడిని సంప్రదించి రూ.26వేలు తస్కరించారు. కేరళ లాటరీ రూ.5 లక్షలు వచ్చిందని, ఈ డబ్బులు ఇవ్వాలంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని ఆదిలాబాద్‌రూరల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి దాదాపు రూ.23,500 దోచుకున్నారు.