
● లక్షల్లో నిధుల ఖర్చు... ● కొన్నింటిలో లోపలికి సైతం వె
మంచిర్యాలటౌన్: పట్టణ ప్రజలకు ఆహ్లాదం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని పార్కులను అభివృద్ధి చేసేందుకు పెద్దమొత్తంలో పట్టణ ప్రగతి నిధులు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పనులు చేపట్టినా ప్రజలకు మాత్రం ఆహ్లాదం అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో కొన్నిచోట్ల పనులను ‘మమ’ అనిపించారు. పార్కులను అభివృద్ధి చేశామని చెబుతున్నా ప్రజలు మాత్రం అందులోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. పాతమంచిర్యాల, రాంనగర్, హైటెక్‌సిటీ ప్లేగ్రౌండ్ పార్కులు మినహా మిగతా పార్కుల్లో ఎక్కడా ఆహ్లాదం కనిపించడం లేదు. పాతమంచిర్యాల పార్కుకు రూ.90 లక్షల నిధులు కేటాయించగా చిన్నారులు, పెద్దలకు ఆహ్లాదం పంచేలా అందులో అభివృద్ధి పనులు చేపట్టారు. వాకింగ్ ట్రాక్‌తో పాటు ఓపెన్‌జిమ్ ఏర్పాటు చేశారు. పార్కు చుట్టూ నిర్మించిన ప్రహరీకి సున్నం వేయించారు. కానీ రూ.90 లక్షలకు అనుగుణంగా పార్కులో ఆహ్లాదం కరువైంది. హైటెక్‌సిటీ కాలనీని చిల్డ్రన్స్‌పార్కులో రూ.50 లక్షలతో వాకింగ్ ట్రాక్, చిన్నారులు ఆడుకునే మూడు రకాల పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ పార్కులోనూ పిచ్చిమొక్కలు పెరిగి అందులోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాత గర్మిళ్ల పార్కు, రాజీవ్‌నగర్‌లోని పార్కులకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టినా అందులోనూ ఆహ్లాదం మాత్రం కనిపించడం లేదు.
చిన్నపిల్లల పార్కుపై నిర్లక్ష్యం
జిల్లా కేంద్రంలోని జాఫర్‌నగర్ రాముని చెరువు కట్టను ఆనుకుని పిల్లల పార్కును ఏర్పాటు చేశారు. అందులో రూ.10 లక్షలతో గతంలో చిన్నారులు ఆడుకునే పరికరాలను ఏర్పాటు చేశారు. పార్కు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆ పరికరాలు తుప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం పిచ్చి మొక్కలు పెరిగాయి. పూర్తిస్థాయిలో పరికరాలు ఏర్పాటు చేసి చిన్నారులు ఆహ్లాదంగా గడిపేందుకు పట్టణ ప్రగతి నిధులు రూ.80 లక్షలు కేటాయించినా ఇంకా పనులు ప్రారంభించలేదు. జిల్లా కేంద్రంలోని ఏకై క పిల్లల పార్కు ఇదే. ఈ పనులను పూర్తి చేస్తే సెలవుల్లో పిల్ల లు సరదాగా గడిపేందుకు ఈ పార్కు ఉపయోగపడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దసరా సెలవుల్లో చిన్నారులు ఆడుకునేందుకు రాంనగర్ పార్కు మినహాయించి, ఏ ఇతర పార్కు వారికి ఉపయోగపడలేదు. ఒక్కో పార్కుకు లక్షల రూపాయల నిధులు కేటాయించినా ఆహ్లాదం అందకపోవడంతో చిన్నారులు ఇళ్లకు, మైదానాలకే పరిమితం అయ్యారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పార్కుల్లో అభివృద్ధి పనులు చేపట్టి ఆహ్లాదం అందేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

● లక్షల్లో నిధుల ఖర్చు... ● కొన్నింటిలో లోపలికి సైతం వె