
రైతుబీమా పరిహారమేది..!
నెలల తరబడి కుటుంబాల ఎదురుచూపులు
అన్ని ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినా అందని వైనం
ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకుంటున్న బాధితులు
మంచిర్యాలఅగ్రికల్చర్: రైతు బీమా పథకం పరిహారం అందకపోవడంతో రైతు కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోతోంది. 2024 ఆగస్టు 15నుంచి ఈ ఏడాది ఆగస్టు 15మధ్య మృతిచెందిన 31 కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నగదు అందలేదు. రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 2018లో రైతుబీమా పథకం ప్రవేశపెట్టింది. 18నుంచి 59ఏళ్ల రైతులను అర్హులుగా పేర్కొంది. రైతు మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా రూ.5లక్షల చొప్పున పరిహారం అందించేలా ఎల్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. అర్హులైన రైతుల ఆధార్‌కార్డు, నామినీ వివరాలు, పట్టాపాస్‌పుస్తకాల జిరాక్స్ కాపీలను జత చేసి దరఖాస్తులను మండల వ్యవసాయ, విస్తరణ అధికారులు సేకరించారు. ఆ వివరాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతు పేరిట రూ.355.94 చొప్పున బీమా ప్రీమియం చెల్లించింది. ఏదైనా కారణంతో రైతు మరణిస్తే రూ.5లక్షలు పరిహారం అందుతుంది. గత ఏడాది జిల్లాలో 1,46,981 మంది పట్టాపాస్ బుక్ ఉన్న రైతులు నమోదు చేసుకోగా ఇందులో 99,393 మందిని అర్హులుగా గుర్తించారు. రైతుల పేరిట బీమా సంస్థ జారీ చేసిన ఐడీ నంబరుతో కూడిన బాండ్లు వ్యవసాయ శాఖ రైతులకు అందజేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు బాండ్లు అందలేదని వాపోతున్నారు. పథకం ప్రారంభంలో అర్హులైన రైతులకు అందజేయగా.. 2019 నుంచి ఇవ్వడం లేదు. ఈ కారణంగా అందులో ఏ తప్పులు ఉన్నాయో తెలియడం లేదు. క్లెయిమ్‌కు వెళ్తున్న సమయంలో తప్పులు ఉంటే అఫిడవిట్‌ను వ్యవసాయ అధికారులకు సమర్పించి పొందేవారు. కానీ ఇప్పుడు అఫిడవిట్ లేదని, బీమా పత్రం ఆధారంగానే చెల్లింపులు చేస్తున్నారు. గత ఏడాది 421మంది మృతిచెందగా 390మంది రైతు కుటుంబాలకు రూ.19.50 కోట్లు పరిహారం అందింది. ఇంకా 31మంది రైతు కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. రైతు మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ, పట్టాపాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నంబరు తదితర వివరాలు సమర్పించి నెలలు గడుస్తున్నా పరిహారం అందడం లేదంటూ ప్రజావాణిలో కలెక్టర్‌కు, వ్యవసాయ, బ్యాంకు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన..
భీమారం మండలం అరెపల్లి గ్రామానికి చెందిన దుర్గం వెంకటస్వామితో నా కూతురికి వివాహం జరిగింది. ఐదేళ్ల క్రితం అనా రోగ్యంతో కూతురు చనిపోయింది. అల్లుడు ఫిబ్రవరి 17 చనిపోయాడు. తల్లిదండ్రులను కోల్పోవడంతో బాబు నా వద్దనే ఉండి చదువుకుంటున్నాడు. అల్లుడి పేరిట 2.5 ఎకరాల భూమి ఉంది. రైతుబీమాకు అర్హుడైనా ఇంతవరకు పరిహారం రాలేదు. వ్యవసాయ కై కిలికి పోనిది పూట గడవదు. రైతుబీమా పరిహారం కోసం సార్లు అడిగిన అన్ని కాగితాలు ఇచ్చిన.. ఇన్ని నెలలు నుంచి ఇటు వ్యవసాయ అధికారులు, అటు బ్యాంకు వద్దకు తిరుగుతున్నా. పరిహారం అందించి ఆదుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన.
– మనవడితో కిష్టమ్మ, ఎర్రగుంటపల్లి, చెన్నూర్

రైతుబీమా పరిహారమేది..!