
‘పట్టు’విడువరూ..!
కోటపల్లి: దసలి పట్టుగూళ్ల పెంపకం ఆదివాసీలు, అటవీ అధికారుల మధ్య వివాదానికి తెరతీసింది. పట్టు పరిశ్రమలో రాష్ట్రంలోనే చెన్నూర్ నియోజకవర్గం మేటిగా నిలుస్తుండగా.. ఎన్నడూ లేనిది ఈసారి అధికారుల ఆంక్షల అడ్డగింత ఆదివాసీ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. కోటపల్లి మండలం రాజారం, కావర్‌కొత్తపల్లి, అర్జునగుట్ట, ఎదులబంధం గ్రామాలకు చెందిన 750 కుటుంబాలు పట్టుపురుగుల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఆరు దశాబ్దాలుగా అటవీ ప్రాంతంలోని నల్లమద్ది చెట్లపై పట్టుపురుగుల పెంపకం చేపడుతున్నారు. ఎదులబంధం, సిర్సా 332, 333 కంపార్ట్‌మెంట్, 360, 358 సిర్సా కంపార్ట్‌మెంట్, పార్‌పల్లి 352, 348, 336 కంపార్ట్‌మెంట్, లింగన్నపేట, కావర్ కొత్తపల్లి గ్రామాల్లోని కంపార్ట్‌మెంట్లలో ఆదివాసీలు పట్టుపురుగులు సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు సుమారు 20వేల పట్టుపురుగులను సాగు చేస్తారు. సుమారు మూడు రోజుల వరకు గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడంతో వాటిని తీసుకెళ్లి నల్లమద్ది చెట్లపై వేస్తారు. పురుగు మీద నుంచి ఒక పొర లాంటిది తీసుకుని ఆకులు తింటూ మళ్లీ ఒక పొర తీస్తాయి. ఇలా నాలుగు పొరలు తీసిన తర్వాత 15రోజులు ఆకులను తినుకుంటూ ఉంటుంది. 45వ రోజు పురుగు ఆత్మరక్షణ కోసం సున్నం లాంటి పదార్థంతో చుట్టూ పొరలా ఏర్పర్చుకుంటుంది. ఇలా ఏర్పర్చుకున్న కాయలను ఆదివాసీలు చెన్నూర్ మార్కెట్‌కు తీసుకొస్తారు. ప్రత్యేక పద్ధతుల్లో వేడి చేసి పట్టును వేరు చేస్తే ఛత్తీస్‌గఢ్, కర్ణాటక వంటి ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేస్తారు. దీంతో సీజన్‌లో ఆదివాసీలకు సుమారు రూ.70 వేల నుంచి రూ.80వేల వరకు ఆదాయం లభిస్తుంది.
ఆందోళన బాటలో ఆదివాసీలు
చెన్నూర్ నియోజకవర్గంలో పట్టుపురుగుల సాగు ను ఆదివాసీ రైతులు 1960 నుంచి సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. 1984లో సెరికల్చర్ కా ర్యాలయంలో నెలకొల్పారు. ఇటీవల అటవీ అధికా రులు అడ్డుకుంటుండడంతో ఆదివాసీలు ఆందోళన బాట పట్టారు. తాము అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం లేదని, నల్లమద్ది చెట్లపైనే పట్టుపురుగు ల పెంపకం చేపడుతున్నామని, అడవికి ఎలాంటి హాని తలపెట్టడంలేదని, ఇన్ని రోజులుగా ఉపాధి పొందుతున్న తమను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కోటపల్లి మండలంలోని అటవీ ప్రాంతాన్ని ప్రాణహిత అభయారణ్యంగా గుర్తించారంటూ అటవీ అధికారులు అడ్డు చెబుతున్నారు.