
‘మందు’స్తు ఏర్పాట్లు
మంచిర్యాలక్రైం: రాష్ట్రంలో అతిపెద్ద పండుగ దసరా.. మాంసం, మద్యంతో విందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. ఈసారి దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చాయి. గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం ఉంటుంది. దీంతో ఆయా దుకాణాలు మూసి ఉంచాలని ఇప్పటికే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎకై ్సజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాలను బుధవారం రాత్రి 10గంటల వరకే మూసి వేయిస్తారు. దీంతో మద్యంప్రియులు దసరాకు ఒక్క రోజు ముందే మద్యం కొనుగోలు చేసేందుకు వైన్స్ దుకాణాల ఎదుట బారులు తీరారు. జిల్లాలో 73మద్యం దుకాణాలు ఉండగా గత నెల 28 నుంచి అక్టోబర్ ఒకటి వరకు రూ.20.16కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు లెక్కల ద్వారా తెలుస్తోంది. గురువారం మద్యం దుకాణాలు మూసి వేయనుండడంతో గ్రామాలు, పట్టణాల్లోని బెల్ట్‌షాపుల్లో మద్యం విక్రయాలకు వ్యాపారులు, నిర్వాహకులు కొందరు ముందస్తుగానే పెద్దమొత్తంలో కొనుగోలు చేశారు. గాంధీ జయంతి రోజున జీవహింస చేయడం నేరం, మద్యం విక్రయాలు నిషేధం ఉండడంతో దసరాకు ఒక్క రోజు ముందే మద్యం, మాంసం అన్నీ సిద్ధం చేసుకున్నారు. బుధవారం రాత్రికే మేకలను వధించి మాంసాన్ని సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ శుక్రవారం దసరా చేసుకుందామని భావించినా మద్యం, మాంసం దొరకడం కష్టమని ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. మరికొందరు బుధవారమే దసరా పండుగ విందు చేసుకున్నారు.
బెల్ట్‌షాపులపై నిఘా
గాంధీ జయంతి సందర్భంగా పోలీసు, ఎకై ్సజ్ శాఖ అధికారులు సమన్వయంతో మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంతాలు, ప ట్టణాల్లోని బెల్ట్‌షాపులపై ప్రత్యేక నిఘా ఉంచారు. మద్యం దుకాణాలు మూసివేత నేపథ్యంలో వీటిల్లో అధికంగా విక్రయాలు జరిగే అవకాశం ఉండడంతో నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు. మద్యం, మాంసం విక్రయాలను ఆయా శాఖల అధికారులు ఎంతవరకు కట్టడి చేస్తారో వేచి చూడాల్సిందే. మద్యం విక్రయించిన వారిపై కేసులు నమోదు చే స్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు.