
‘దసలి పట్టు రైతులపై దాడులు ఆపాలి’
కోటపల్లి: దసలి పట్టు సాగు చేస్తున్న గిరిజన రైతులపై ఫారెస్టు అధికారుల దాడులు ఆపాలని, సాగుకు అనుమతి ఇవ్వాలని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని కొత్తపల్లి రాజారం గ్రామంలో అటవీ ప్రాంతంలో దసలి పట్టు పురుగుల పెంపకం చేస్తున్న గిరిజన రైతులపై బుధవారం ఫారెస్టు అధికారులు దాడులు చేయడమే కాకుండా పట్టు పురుగులు నాశనం చేశారని ఆందోళన చేపట్టారు. వీరికి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి మద్దతు తెలిపారు. తెలంగాణలో అన్ని చోట్ల అడ్డు చెప్పకుండా కోటపల్లి మండలంలో అడ్డు చెప్పడం విడ్డూరమని అన్నారు. అనంతరం చెన్నూర్ ఎఫ్‌డీవో కార్యాలయ సిబ్బందికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీతారాంరెడ్డి, గిరిజన రైతులు పాల్గొన్నారు.