
ప్రత్యేక బలగాలతో బందోబస్తు
మంచిర్యాలక్రైం: దసరా రోజు ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా ప్రత్యేక బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. దసరా పండుగ సందర్భంగా శాంతిభద్రతలపై బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తారని, మంచిర్యాల నగరంలో ఏడు ప్రత్యేక బృందాలు డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాయని తెలిపారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా మద్యనిషేధం అమలులో ఉంటుందని, ఎవరైనా అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బెల్ట్‌షాపులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. మద్యంమత్తు, పాతకక్షల కారణంగా గొడవలు జరుగుతుంటాయని, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామని తెలిపారు. ఎక్కడైనా సమస్య ఉందని తెలిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.