
దసరా వేడుకలకు సిద్ధం
మంచిర్యాలఅర్బన్/బెల్లంపల్లి/చెన్నూర్: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి వేడుకలకు జిల్లా సిద్ధమైంది. గురువారం దసరా పండుగను పురస్కరించుకుకుని బుధవారం మంచిర్యాల గోదావరి నది ఒడ్డున గౌతమేశ్వర ఆలయం వద్ద శమీ చెట్టు వద్ద చదును చేశారు. రాంనగర్‌లో రావణాసుర వధ కార్యక్రమం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. నూతన వాహనాలు, ఇతర సామగ్రి కొనుగోలుతోపాటు ఆయుధ, వాహన పూజలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పనిముట్లు, యంత్రాలు, వ్యవసాయ పరికరాలకు పూజలు చేస్తారు. మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి, పార్వతీపరమేశ్వరుల ఉత్సవ దేవతామూర్తులతో స్థానిక గోదావరి నదీ తీరాన గౌతమేశ్వర ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. జంబీ చెట్టు వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో పూజలు చేస్తారు. అనంతరం శోభాయాత్ర పురపాలక సంఘం కార్యాలయం మీదుగా విశ్వనాథ ఆలయం వరకు నిర్వహిసారు. 59ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. బెల్లంపల్లి పట్టణంలోని తిలక్‌స్టేడియంలో సభావేదిక, రావణాసుర వధ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. చెన్నూర్‌లో దసరా పండుగకు ప్రత్యేకత ఉంది. పుణ్యనదిగా పేరొందిన పంచక్రోశ ఉత్తర వాహిని సమీపంలోని గోవరమ్మ ఆలయం వద్ద సుమారు రెండు శతాబ్దాలకు పైగా శమీ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజలను అనాదిగా పట్వారీ శ్రీనివాస్‌రావు కుటుంబ వారుసులే నిర్వహిస్తూ వస్తున్నారు.