
మెరుగైన వైద్యసేవలు అందించాలి
భీమారం: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు వార్డులు, రిజిష్టర్లు, మందుల నిల్వలు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యరంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రజాసంక్షేమం కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించే విధంగా పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలోని మందులు, స్టాఫ్ వివరాలను స్టాఫ్‌నర్స్ కృష్ణవేణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే కస్తూర్భా బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.