
ఎన్నికల నియమావళి పాటించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నోడల్, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చామని అన్నారు. మండల స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి నామినేషన్లు, ఫిర్యాదులు, సందేహాల సంబంధిత అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ మొదలై ఓట్లు లెక్కింపు, ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో గణపతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
హెల్ప్‌లైన్ ఏర్పాటు
మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ ఇతర ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు, దరఖాస్తులకు హెల్ప్‌లైన్ నంబరు 08736– 250501 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనపై సమాచారం అందించవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.