అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి
● అనుమానితుల సమాచారం పోలీసులకు చేరవేయాలి ● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ● ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష
మంచిర్యాలక్రైం: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు 24గంటలూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం కమిషనరేట్ సమవేశ మందిరంలో రెండు జిల్లాల పోలీస్ అధికారులు, సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, ప్రధానమైన ఇండస్ట్రియల్ సంస్థల అధికారులతో ఆపరేషన్ సిందూర్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. రక్షణపరంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమాచారం వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతర నిఘా పెంచాలని తెలిపారు. ముష్కరులు ఏ రూపంలోనైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించిన, ప్రజలకు ఇబ్బంది కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని, నిరంతర నిఘా కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు భాస్కర్, కరుణాకర్, అదనపు డీసీపీ రాజు, సింగరేణి, ఎన్‌టీపీసీ, జిల్లా ఫైర్ అధికారులు సీఐఎస్ ఎఫ్, సీఆర్‌పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.


