ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య
కాసిపేట: మండల కేంద్రానికి చెందిన దుర్గం రమ్య (27)అనే వివాహిత ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. కాసిపేటకు చెందిన దుర్గం రాజమల్లుతో వెంకటపూర్‌కు చెందిన రమ్యకు 2016లో వివాహం జరిగింది. కొద్దిరోజుల క్రితం రాజమల్లుకు పక్షవాతం రాగా రమ్య వివిధ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. అప్పులై మనస్తాపానికి గురి కాగా తండ్రి కుమ్మరి రాజన్న ధైర్యం చెప్పేవాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు గమనించి మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా రమ్య దంపతులకు ఏడేళ్ల కూతురు ఉంది. రమ్య తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


