చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని రెస్టారెంట్‌లు, హోటళ్లపై గురువారం మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. పరిశుభ్రత పాటించని హయాన్ బార్, రెస్టారెంట్, సితార గ్రాండ్ హోటల్‌కు రూ.500 జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత పాటించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. నిబంధనలు పాటించని హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
చింతగూడ ఆలయంలో చోరీ
జన్నారం: మండలంలోని చింతగూడ శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించినట్లు ఆలయ ఈవో ముక్త రవి తెలిపారు. గురువారం ఉదయం అర్చకుడు ఆలయానికి వచ్చేసరికి గేటు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా అమ్మవారి వెండి ముక్కుపుడక కనిపించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజవర్థన్ తెలిపారు.


