● అదనపు కలెక్టర్ మోతీలాల్ ● ఘనంగా మహిళా దినోత్సవ వారోత్సవాల ముగింపు
కాసిపేట: కుటుంబాన్ని తీర్చిదిద్దడంతోపాటు దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైనదని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో జిల్లా వయోజనవిద్య, సఖి లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆటల పోటీల్లో విజేతలైన మహిళలకు బహుమతులు అందజేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ఆత్మస్థైర్యమే గొప్ప ఆయుధమని, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మండలాన్ని వందశాతం అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో మహిళల పాత్ర అధికంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, సఖి లయన్స్‌క్లబ్ అధ్యక్షురాలు బండ శాంకరి, డీఆర్‌పీలు సుమన్, అశోక్‌రావు, అక్షర వాలంటీర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఐకేపీ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


