అంతా ‘ఓపెన్‌’.. ఈ పరీక్షలో మీకు నచ్చినంత కాపీ కొట్టండి.. | Mass copying in Open education system | Sakshi
Sakshi News home page

అంతా ‘ఓపెన్‌’.. ఈ పరీక్షలో మీకు నచ్చినంత కాపీ కొట్టండి..

May 3 2023 12:38 AM | Updated on May 3 2023 6:04 PM

బెల్లంపల్లిలోని ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్ష కేంద్రం - Sakshi

బెల్లంపల్లిలోని ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్ష కేంద్రం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పాస్‌ కావాలంటే పైసలు ఇవ్వాల్సిందే అన్నట్లుగా ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ సాగుతోంది. జిల్లాలో తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(టాస్‌) నిర్వహిస్తున్న టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు గతనెల 25 నుంచి మొదలయ్యాయి. ఈనెల 4తో ముగియనున్నాయి. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న వారు 686 మంది ఉండగా, ఇంటర్‌ పరీక్షలు 1,253 మంది రాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టెన్త్‌ పరీక్ష కేంద్రాలు మూడు, ఇంటర్‌ పరీక్ష కేంద్రాలు ఏడు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో కాపీంగ్‌ జరుగుతోంది.

అందరూ బడిమానేసిన వారే..

పదో తరగతి, ఇంటర్‌ చదవకుండానే మధ్యలోనే బడి, కాలేజీ మానేసిన విద్యార్థులకు ఓపెన్‌ విధానంలో పరీక్షలు రాసి, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంది. పలు కారణాలతో రెగ్యూలర్‌ చదువుకు దూరం అయిన వారు, ఉద్యోగార్థులు, గృహిణులు, వేర్వేరు వృత్తుల్లో ఉన్నవారు కూడా మళ్లీ చదువుకుని, విద్య సర్టిఫికెట్లు పొందే అవకాశం ఉంది.

సర్టిఫికెట్ల కోసం..

విద్య, ఉద్యోగ, వ్యాపార, రుణాలు, విదేశీయా నం, లైసెన్సులు తదితర అవసరాల కోసం పదో తరగతి, ఇంటర్‌ సర్టిఫికెట్లు తప్పనిసరిగా మారాయి. దీంతో చాలా మంది ఓపెన్‌ విధానంలో పరీక్షలకు హాజరువుతూ తమ విద్యార్హతను పెంచుకుంటున్నారు. ఏటా టాస్‌ ఆధ్వర్యంలో స్టడీ సెంటర్లలో అకాడమిక్‌ ప్రకారం సిలబస్‌ పూర్తి చేయడంతో పాటు, ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తుంటారు. బడిమానేసి, మళ్లీ చదువుకునే వారిలో చాలా మంది వయసు పైబడిన వారితోపాటు, యువత కూడా ఉన్నారు. దీంతో వారంతా ఓపెన్‌ పరీక్షల్లో తప్పనిసరిగా పాస్‌ కావాలనే ఆకాంక్షతో ఉంటున్నారు. ఇప్పటికే ఓపెన్‌ విధాన పరీక్షల్లో ఇన్విజిలేటర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తారనే విమర్శలు ఉన్నాయి.

నిర్వాహకుల వసూళ్లు..

పాస్‌ కావాలనే ఉద్దేశంతో కొందరు ఓపెన్‌ విద్యార్థులు పైసలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదు. ఆయా సెంటర్ల ఇన్విజిలేటర్లు, సెంటర్‌ సూపరింటెండెంట్లతో ముందే మాట్లాడుకుంటున్నారు. కొందరు టీచర్లు, విద్యార్థుల బలహీనతను ఆసరా చేసుకుని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు తీసుకుంటున్నారు.

పరీక్షకు ముందే తమకు తెలిసిన ఒకరిని నియమించుకుని వారితో పైసలు వసూలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ సెంటర్‌లో సీనియర్‌ టీచర్‌ వారం రోజులుగా పరీక్ష రాస్తున్న వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎగ్జామ్స్‌కు హాజరవుతున్నవారే చెబుతున్నారు. ఇక బెల్లంపల్లి పట్టణంలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న ఓపెన్‌ సెంటర్లలో కూడా వసూళ్లు అందరికీ తెలిసే జరుగుతున్నాయి.

పరీక్ష జరుగుతున్నప్పుడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, జిల్లా ఉన్నతాధికారులు కేంద్రానికి వచ్చినప్పుడు ముందే అలర్ట్‌ చేయడం, నోట్‌ బుక్‌లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వడం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకరికి బదులు మరొకరిని కూడా పరీక్షలకు అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఓపెన్‌ పరీక్ష కేంద్రాల్లో వసూళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement