● వాహనాలు వదిలి గుట్టల్లోకి పరార్
● చిన్నరాజమూర్‌లో ఘటన
● స్థానిక వ్యక్తి సహకారంపై అనుమానాలు
దేవరకద్ర రూరల్: మండలంలో చిన్నరాజమూర్‌లో బుధవారం పశువుల దొంగలు హల్‌చల్ చేసిన ఘటన చోటు చేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వన్నడ రాజు మంగళవారం రాత్రి తన 10 గేదెలను రోజులాగే గ్రామ సమీపంలో ప్రధాన రోడ్డుకు అనుకొని ఉన్న వ్యవసాయ పొలం వద్ద కట్టేశాడు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రెండు బొలెరో వాహనాలు, ఒక కారులో వచ్చిన ఎనిమిది మంది వ్యక్తులు.. ముందుగా ఒక బొలెరోలో రెండు గేదెలను ఎక్కించి తీసుకెళ్లారు. ఇంకో బొలెరోలో మరో గేదెను ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా సమీప పొలాల్లో నిద్రిస్తున్న రైతులు శబ్ధాలు విని, అక్కడికి రావడంతో వాహనాలు అక్కడే వదిలి సమీప గుట్టల్లోకి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత దారి తెలియక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఓ వ్యక్తి గ్రామస్తులకు చిక్కాడు. ఇదిలా ఉండగా.. ముందుగా గేదెలను తీసుకెళ్లిన వారికి పరారైన దొంగల ద్వారా జరిగిన సమాచారం అందింది. విషయం చుట్టుపక్కల గ్రామాలకు చేరితే పట్టుబడతామనే భయంతో కొండాపూర్ సమీపంలో గేదెలను దించేందుకు ప్రయత్నించారు. కొండాపూర్ రైతుకు అనుమానం వచ్చి గట్టిగా కేకలు వేయడంతో హడావుడిగా గేదెలను రోడ్డుపై దించేసి నిందితులు వాహనంతో పరారయ్యారు. ఉదయం వెటర్నరీ వైద్యుడికి విషయం తెలియడంతో పరిచయస్తులకు ఆ గేదెల ఫొటోలు పంపించారు. ఇదే క్రమంలో ఫొటోలు బాధిత రైతుకు చేరగా.. అవి తన గేదెలేనని గుర్తించి తీసుకొచ్చా రు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నరాజమూర్‌కు చేరుకొని దొంగలు వదిలి వెళ్లిన బొలెరో, కారును స్వాఽధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వాహనాలకు ఉన్న అసలు నంబర్ ప్లేట్లపై మరో నెంబర్లను అతికించినట్లు గుర్తించిన పోలీసులు ఆ కోణంలోనూ విచారిస్తున్నారు. వాహనాల్లో పెద్ద సంఖ్యలో పశువులను కట్టేందుకు ఉపయోగించే తాళ్లు, కారులో పెద్ద మూటలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
స్థానిక వ్యక్తి ఎవరు?
చిన్నరాజమూర్ పరిసర ప్రాంతాలను ముందుగానే గుర్తించి దొంగలకు సమాచారం అందించేందుకు పక్క గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సహకరించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడిన వ్యక్తిని పోలీసులు విచారించగా.. పక్క గ్రామం వద్ద ఒక వ్యక్తిని తమ వాహనంలో ఎక్కించుకున్నామని చెప్పినట్లు తెలిసింది. కాగా ఘటన స్థలాన్ని సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి పరిశీలించి, రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పశువుల దొంగలు పట్టుబడ్డారన్న సమాచారం తెలియడంతో చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన పలువురు రైతులు గతంలో తమ పశువులు, వ్యవసాయ బోర్లకు సంబంధించి చోరీలపై పోలీసులను సంప్రదిస్తున్నారు.


