● మహిళ మృతి..
మరో ఇద్దరికి తీవ్రగాయాలు
● దసరాకు కొత్త వస్త్రాలు తీసుకొని
వెళ్తుండగా ఘటన
నవాబుపేట: మైసమ్మ అడవిలోని ప్రమాదకర మలుపులు మరోసారి ప్రమాదానికి కారణమయ్యాయి. బుధవారం రాత్రి కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని మైసమ్మ ప్రధాన మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాకేంద్రం నుంచి కాకర్లపహాడ్ వైపు వెళ్తున్న ఆటోను.. నవాబుపేట నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కాకర్లపహాడ్‌కు చెందిన గొర్ల సరిత (38) అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో డ్రైవర్ ఇమ్రాన్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆటోలో ప్రయాణిస్తున్న మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌కు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలిసింది.
దసరా పండుగ కోసం వస్త్రాలు తీసుకొస్తూ..
సరిత కుటుంబ పోషణ కోసం టైలరింగ్ చేసేవారు. దసరా పండగ నేపథ్యంలో కొత్త బట్టలు కొనుగోలు చేసేందుకు బుధవారం భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. బట్టలు తీసుకుని తిరిగి వస్తుండగా భర్త మాధవులు పని నిమిత్తం మహబూబ్‌నగర్‌లో ఆగిపోయారు.భార్యను ఆ టోలో స్వగ్రామానికి పంపించారు.ఇంటికి మ రో మూడు కిలోమీటర్ల దూరమే ఉండగా మైస మ్మ మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో సరిత మృతి చెందారు. కిరాయి నిమిత్తం నవాబుపేట మండలానికి వచ్చిన కారు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో చోరీ
● 12 తులాల బంగారం, నగదు అపహరణ
కల్వకుర్తి టౌన్: ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కల్వకుర్తి మండలం ఎల్లికల్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఎల్లికల్‌కు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శేఖర్ కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి మహబూబ్‌నగర్‌కు వెళ్లాడు. బుధవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చే సరికి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించాడు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా 12తులాల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి చోరీ జరిగిన తీరును పరిశీలించారు.
కొత్త ఉల్లి వచ్చినా.. తగ్గని ధర
దేవరకద్ర: మార్కెట్‌కు కొత్త ఉల్లి దిగుబడులు ప్రారంభమైనా ధరలు తగ్గలేదు. బుధవారం జరిగిన వేలంలో పాత ఉల్లి క్వింటాల్ గరిష్టంగా రూ.4,900, కొత్త ఉల్లి రూ.4,100 పలికింది. పాత ఉల్లి కనిష్టం రూ.4,200, కొత్తది రూ.4,000గా నమోదైంది. మార్కెట్‌కు 300 బస్తాలు మాత్రమే వచ్చాయి. కాగా.. పచ్చ జొన్నలకు భారీ డిమాండ్ నెలకొంది. క్వింటాల్ గరిష్ట ధర రూ.8,500, కనిష్టం రూ.6,500 పలికింది. అముదాలకు గరిష్టంగా రూ.6,955 ధర లభించింది.


