
‘ఏదుల’ నుంచి నీటి తరలింపు సరికాదు
నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి పరిధిలోని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలించే ప్రతిపాదన సరికాదని.. విరమించుకోవాలని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలు ప్రస్తావించారు. శ్రీశైలం ముందరి తీరం నీటిని నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 3.41 లక్షల ఎకరాలకు అందించేలా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనలో ఉందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ద్వారా రంగారెడ్డి, నల్గొండ, పాలమూరు జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని.. ఏదుల నుంచి నీటిని తరలిస్తే ఇక్కడి ప్రజలకు అన్యాయం జరగుతుందని, ఈ ప్రాంత రైతులు చట్టబద్ద హక్కు కోల్పోతారని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 36 లక్షల ఎకరాల సాగుభూమి ఉంటే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల నుంచి 7 నుండి 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతుందన్నారు. నల్గొండలో 24.7 లక్షల ఎకరాల సాగుభూమి ఉంటే అక్కడి ప్రాజెక్టుల ద్వారా 17 లక్షల ఎకరాలకు నీరందుతుందని.. వెంటనే ప్రతిపాదనను వెనక్కి తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి గాయాలు
దోమలపెంట: రెండు తుఫాన్ వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలైన ఘటన శ్రీశైలం ప్రధాన రహదారిలో దోమలపెంట వద్ద గురువారం జరిగింది. ఈగలపెంట ఎస్‌ఐ జయన్న తెలిపిన వివరాలు.. మహారాష్ట్రకు చెందిన భక్తులు శ్రీశైలం దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన భక్తులు శ్రీశైలం వస్తున్నారు. ఈ క్రమంలో దోమలపెంట నుంచి ఈగలపెంటకు వెళ్తున్న రహదారిలో స్తూపం సమీపంలోని దర్గా వద్ద రెండు తుఫాన్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.