
జూరాల వంతెనపై ఆందోళన
అమరచింత: పాత జీఓ ప్రకారమే నందిమళ్ల నుంచి రేవులపల్లి వరకు నదిపై హైలేవల్ వంతెన నిర్మించాలంటూ నందిమళ్ల, రేవులపల్లి గ్రామస్తులు గురువారం జూరాల జలాశయంపై ఆందోళన చేపట్టారు. ఆయా గ్రామాల వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి డ్యాం సమీపంలోని నందిమళ్ల నుంచి రేవులపల్లి వరకు కృష్ణానదిపై రూ.120 కోట్లతో వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారని, ఇందుకు సంబంధించిన జీఓ సైతం ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ప్రస్తుతం ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం మీదుగా వంతెన నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణంలో సమీప గ్రామాలైన నందిమళ్ల, కిష్టంపల్లి, ఈర్లదిన్నె, మిట్టనందిమళ్ల, చింతరెడ్డిపల్లి, రేవులపల్లి తదితర గ్రామస్తులు వ్యవసాయ భూములు, ఇళ్లు కోల్పోయారన్నారు. డ్యాం కోసం సర్వం త్యాగం చేసిన ఆయా గ్రామస్తులకు మేలు చేయకుండా హైలేవల్ వంతెనను అకారణంగా మార్చడం తగదన్నారు. నందిమళ్ల సమీపంలో వంతెన నిర్మిస్తే నారాయణపేట, రాయిచూర్, వనపర్తి, మహబూబ్‌నగర్ ప్రాంతాల వర్తకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. రియల్ వ్యాపారం కోసమే కొందరు ఇక్కడికి మంజూరైన వంతెనను జూరాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణ స్థలం మారిస్తే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మూడు గంటల పాటు రాస్తారోకో చేయడంతో రాకపోకలు నిలిచి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, సంజీవ్, రమేష్, చింతలన్న, రవి, రాజు, మురళి, ప్రసాద్, మధు తదితరులు పలువురు పాల్గొన్నారు.
పాత జీఓ ప్రకారమే హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలన్న నందిమళ్ల,
రేవులపల్లి గ్రామస్తులు
మూడుగంటల పాటు
నిలిచిన రాకపోకలు