
ఇంకెన్నాళ్లు.. యూరియా పాట్లు
● పీఏసీఎస్‌లు, రైతువేదికల వద్ద రైతుల పడిగాపులు
● రోజంతా ఎదురుచూసినా ఒక్క బస్తా దొరకని వైనం
● జిల్లాలో నిత్యకృత్యమైన ధర్నాలు, రాస్తారోకోలు
● టోకెన్లు ఇచ్చి.. చేతులు దులుపుకొంటున్న అధికారులు
● అదును మించిపోతోందని అన్నదాతల ఆందోళన
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. వరి పంటకు యూరియా వేసే సమయం మించిపోయి.. సీజన్ ముగింపు దశకు చేరుకొంటున్నా సరిపడా సరఫరా చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి తీవ్రమైన కొరత నెలకొంది. దీంతో యూరియా కోసం రైతులు రోజంతా రైతువేదికలు, పీఏసీఎస్‌లు, గోదాంల వద్ద పడిగాపులు కాయడం, క్యూలైన్లలో బారులుదీరడం.. చివరికి దొరకకపోతే రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు చేయడం నిత్యకృత్యమైంది. వానాకాలం వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు యూరియా కోసం రైతువేదికలు, పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు కాస్తూ.. రోడ్లపై ధర్నాలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక బస్తా కోసం రైతులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. పంటలకు సకాలంలో యూరియా తప్పనిసరిగా వేయాలని, లేకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి జిల్లాకు 38,787 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచాల్సి ఉండగా, ఇప్పటి వరకు 25,755 మెట్రిక్ టన్నులే సరఫరా చేయడంతో కొరత ఏర్పడుతుంది.
పెరిగిన వరి సాగు..
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 3,55,237 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాదితో పోలిస్తే వరి సాగు పెరగగా.. పత్తి సాగు తగ్గింది. గత వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం 1,94,983 ఎకరాలు ఉండగా.. ఈసారి 2,16,605 ఎకరాల్లో సాగవుతున్నట్లు అంచనా. సన్నాలకు ప్రభుత్వం రూ.500 ప్రోత్సాహకం ఇస్తుండటంతో అంచనాలకు మించి రైతులు వరి సాగు చేస్తున్నారు. గతేడాది పత్తి సాగు విస్తీర్ణం 82,344 ఎకరాలు ఉండగా.. ఈసారి 80,482 ఎకరాలకు పరిమితం చేశారు. అలాగే మొక్కజొన్న, జొన్న, కంది పంటల సాగు పెరిగింది. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగవుతుండగా.. వరి, మొక్కజొన్నకు రెండు విడతలు, పత్తికి ఒక విడత యూరియా చల్లాల్సి ఉంటుంది. అయితే జూలైలో తొలి దఫా, ఆగస్టులో రెండో దఫా యూరియా అవసరం ఉన్నా నిల్వలు లేకపోవడంతో రైతులు సకాలంలో వేయలేకపోయారు. ఇక రోజుల తరబడి బస్తాల కోసం రాత్రనకా.. పగలనకా పడిగాపులు కాస్తున్నారు. జిల్లాకు ప్రభుత్వం యూరియా కేటాయింపులు తగ్గించడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
9,435 టన్నులు అవసరం
ప్రస్తుత సెప్టెంబర్ నెలలో యూరియా సమస్య గట్టెక్కాలంటే 9,435 మెట్రిక్ టన్నులు అవసరం. జిల్లాకు 38,787 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉంది. గత ఆగస్టులోనూ సరిపడా నిల్వలు సరఫరా లేకపోవడంతోనే పెద్దఎత్తున ఆందోళనలు నెలకొన్నాయి. ఆగస్టులో 2,523 మెట్రిక్ టన్నుల సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వెనువెంటనే రావాల్సిన నిల్వలపై దృష్టిపెడితే రైతుల సమస్యలను పరిష్కరించవచ్చు. జూన్, జూలై మాసాల్లోనూ యూరియా కేటాయింపులు తగ్గించడంతో నిల్వలు లేకుండాపోయాయి. లారీల్లో వస్తున్న యూరియా బస్తాలు నిమిషాల్లోనే కానరాకుండా పోతున్నాయి. దీంతో ఆందోళన చేస్తున్న వారికి అధికారులు రేపు వస్తాయని, ఇప్పుడు టోకెన్లు ఇస్తామని చేతులు దులుపుకొంటున్నారు.
పంపిణీలో అక్రమాలు సహించం
జడ్చర్ల: రైతులకు యూరియా పంపిణీలో కొందరు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని, రైతులకు దక్కాల్సిన యూరియా పంపిణీలో అక్రమాలను సహించబోమని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇకపై సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ద్వారా రైతులకు స్వయంగా టోకెన్లు జారీ చేయాలని సూచించారు. నవాబుపేటలో ఓ డీలర్ ఎలాంటి టోకెన్లు లేకుండా ఇష్టం వచ్చిన వారికి పంపిణీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరపాలని ఆదేశించారు. కేంద్రం నుంచి సకాలంలో యూరియా సరఫరా కాకపోవడం, అధిక విస్తీర్ణంలో పంటలు సాగవడంతో యూరియా కొరత ఏర్పడిందన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఇంకెన్నాళ్లు.. యూరియా పాట్లు