
ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయినందున ఆస్తిపన్ను లక్ష్యాన్ని చేరుకునేందుకు అందరూ దృష్టిపెట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాత్రి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో వార్డు ఆఫీసర్లతోపాటు రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. మొత్తం ఆస్తిపన్ను రూ.52 కోట్లకు గాను ఇంత వరకు రూ.29 కోట్లే వసూలు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ విధిగా 60 డివిజన్ల పరిధిలో ఇంటింటికీ తిరిగి గడువులోగా వీలైనంత ఎక్కువగా వసూలు చేయాలన్నారు. మొండి బకాయిదారుల వద్దకు అవసరమైతే తనతోపాటు ఏఎంసీ, ఆర్‌ఓలు సైతం వస్తామన్నారు. మున్సిపల్ షాపుల అద్దెలను కూడా వసూలు చేయాలన్నారు. సమావేశంలో ఏఎంసీ అజ్మీరా రాజన్న, ఆర్‌ఓలు మహమ్మద్ ఖాజా, యాదయ్య, ఆర్‌ఐలు రమేష్, టి.నర్సింహ, ముజీబుద్దీన్, అహ్మద్‌షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛత కార్యక్రమాల పరిశీలన
పెద్దచెరువు వద్ద న్యూటౌన్ వైపు వరద కాల్వలో పేరుకుపోయిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం మున్సిపల్ సిబ్బందితోపాటు ఎల్‌డీఎం భాస్కర్ తొలగించారు. అలాగే బస్టాండు సమీపంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనం ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించారు. ఆయా ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తనిఖీ చేసి సిబ్బందికి సూచనలిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.