
రెండు ఆటోలు ఢీకొని ముగ్గురు ప్రయాణికుల దుర్మరణం
మహబూబ్‌నగర్ జిల్లా తుల్జాభవానితండా వద్ద ఘటన
భూత్పూర్: ఓ ఆటోడ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని తుల్జాభవానితండా వద్ద ఈ ఘటన జరిగింది. భూత్పూర్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ నర్సింహులు గురువారం ఉదయం ముగ్గురు ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని భూత్పూర్ వస్తున్నాడు. అదే సమయంలో హన్వాడకు చెందిన ట్రాలీ ఆటోలో భూత్పూర్ నుంచి కొత్తమొల్గరకు కూల్‌డ్రింక్స్ తరలిస్తున్నారు.
ఈ క్రమంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు తుల్జాభవానితండా వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఖిల్లాఘనపురం నుంచి వస్తున్న ఆటోలోని ప్రయాణికులు నర్సింహారెడ్డి (56), వంశీ (23), పాత్లావత్ సక్రి (34) అక్కడికక్కడే మృతిచెందగా.. ఆటో నడుపుతున్న డ్రైవర్ నర్సింహులు గాయపడ్డాడు. మరో ఆటోడ్రైవర్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడ్డ నర్సింహులును అంబులెన్స్‌లో జనరల్ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా ఆటోడ్రైవర్ నర్సింహులు చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఆటోను నిర్లక్ష్యంగా నడిపినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాలీ ఆటోడ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెపుతున్నారు.
పెద్దల పండుగకు వచ్చి వెళ్తూ..
భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఖిల్లాఘనపురంలో ఉండే చెల్లెలు పెద్దల పండుగ చే యడంతో అక్కడికి వెళ్లాడు. తిరిగి హైదరాబాద్‌కు వెళ్లే క్రమంలో రో డ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
కుమార్తెలను తీసుకురావడానికి వెళ్తూ..
ఖిల్లాఘనపురం మండలం దొంతికుంటతండాకు చెందిన పాత్లావత్ సక్రి.. జడ్చర్ల సమీపంలోని ఆశ్రమ పాఠశాల నుంచి తన ఇద్దరు కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
కూలీ పనుల కోసం..
ఖిల్లాఘనపురం మండలం గట్టుకాడిపల్లి గ్రామానికి చెందిన వంశీ (23) కూలీ పనులకోసం ఆటోలో వెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఖిల్లాఘనపురం ఆటో డ్రైవర్ నర్సింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.