
పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి చేద్దాం
కొల్లాపూర్: పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ హితమై న విద్యుదుత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మండలంలోని సోమశిలలో జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులతో విద్యుదుత్పత్తి, వినియోగం, ఉత్పాదక సామర్థ్యం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. హైడల్ పవర్‌తోపాటు పంప్‌డ్ స్టోరేజీతో పెద్దఎత్తున విద్యుదుత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 పాయింట్స్ గుర్తించి, వాటిమీద సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. కృష్ణానదిపై ఉన్న జూరాల నుంచి పులిచింతల వరకు గల హైడల్ ప్రాజెక్టులను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే అంతర్జాతీయంగా పేరుగాంచిన కన్సల్టెంట్ల సహకారం తీసుకోవాలని చెప్పారు. సోలార్ ద్వారా పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్‌ను స్టోరేజీ చేసి రాత్రివేళల్లో వినియోగించుకునేందుకు అవసరమైన సాంకేతిక, స్టోరేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. 1978లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తోషిబా, మిస్టుబుషి వంటి సంస్థల సాంకేతికతను వినియోగించుకున్న విషయాలను ఆయన గుర్తుచేశారు. సాంకేతికత వినియోగం కోసం కిందిస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం స్థానిక లంబాడీ గిరిజనులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క