
ద్విచక్ర వాహనాలు ఢీ.. యువకుడి మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని నెల్లకొండ గేట్ సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నెల్లూరు జిల్లా అనంతసాగర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ (25) స్థానికంగా ఉంటున్న మేనత్త లక్ష్మిదేవి వద్ద ఉంటున్నాడు. శనివారం తన మామ నిర్వహిస్తున్న కట్టెకోత మిషన్ వద్దకు బైక్‌పై వెళ్తుండగా నెల్లికొండ గేట్ సమీపంలో ద్విచక్రవాహనం నడుపుతున్న ఓ మైనర్ ఇండికేటర్ వేయకుండా మళ్లడంతో ప్రవీణ్ బైక్‌తో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి తరలించారు. యువకుడి మృతిపై ఎస్‌ఐ గోవర్ధన్‌ను వివరణ కోరగా మృతుడి మామ ఆవుల రమణయ్య ఫిర్యాదు మేరకు ద్వి చక్రవాహనం నడిపిన మైనర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
కృష్ణా: మండల కేంద్రంలోని కృష్ణా బ్రిడ్జి సమీపంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని సుమారు 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి గుర్తు తెలియని రైలు ఢీకొని మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానికులు కృష్ణా రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రుద్రవరం సతీష్‌కు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వైట్ కలర్ ప్యాంట్, గళ్లచొక్క ధరించి ఉన్నాడని ఆచూకీ తెలిసిన వారు మహబూబ్‌నగర్ ఎస్‌ఐను సంప్రదించాలని కోరారు.
కర్ణాటకలో ఉజ్జెల్లి
యువకుడు మృతి
మాగనూర్: మండలంలోని ఉజ్జెల్లికి చెందిన బల్ల గణేష్ (27) వరినాట్ల కోసం శనివారం కర్ణాటకకు వెళ్లి అక్కడే నీటిగుంతలో పడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి కథనం మేరకు.. కర్ణాటకలోని అజిలాపూర్, ఇడ్లూర్ గ్రామాల మధ్య రైతు కుంభరి శంక్రప్ప పొలంలో వరి నాటు వేసేందుకు గణేష్ స్థానిక కూలీలతో కలిసి వెళ్లాడు. సాయంత్రం పని ముగిసిన తర్వాత పక్కనే ఉన్న గుంతలో కాలు, చేతులు శుభ్రం చేసుకునేందుకు వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన తోటి కూలీలు వెళ్లి చూడగా మొర్రం గుంత దగ్గర గట్టుపై చెప్పులు, దుస్తులు కనిపించడంతో కాలుజారి గుంతలో పడినట్లు గుర్తించారు. స్థానికుల సాయంతో సైదాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా రాత్రి 10 గంటల సమయంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు. ఆదివారం ఉదయం గాలింపు చేపట్టగా ఉదయం 10 గంటల సమయంలో మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సైదాపూర్‌కు తరలించారు. గణేష్‌కు ఐదు నెలల కిందటే పెళ్లయినట్లు గ్రామస్తులు తెలిపారు.
మహిళ మృతిపై కేసు నమోదు
కొల్లాపూర్: మహిళ అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హృషికేశ్ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. మండలంలోని ఎన్మన్‌బెట్లకు చెందిన మరాఠి మంగమ్మ(45) ఆదివారం మధ్యాహ్నం కల్లు దుకాణం సమీపంలో కూర్చున్న చోటునే మృతిచెందింది. కల్తీ కల్లు తాగడంతోనే మంగమ్మ చనిపోయిందంటూ కుటుంబీకులు మృతదేహాన్ని కల్లు దుకాణం ఎదుట ఉంచి ఆందోళన చేపట్టారు. మంగమ్మ అతిగా మద్యం తాగడంతో చనిపోయిందని కల్లు దుకాణం నిర్వాహకులు తెలిపారు. మంగమ్మ మృతిపై అనుమానం ఉందంటూ ఆమె కుమారుడు కొల్లాపూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కల్లు శాంపిల్స్‌ను సేకరించి, దుకాణాన్ని సీజ్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ నాగిరెడ్డి తెలిపారు.
ఇద్దరు నిందితుల రిమాండ్
ఇటిక్యాల: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఇటిక్యాల ఎస్‌ఐ రవి ఆదివారం తెలిపారు. జూలై నెలలో ఎర్రవల్లి, ఉదండాపురంలోని పలు షాపుల్లో చోరీలకు పాల్పడగా ఆయా షాపుల యాజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఎర్రవల్లి కూడలిలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో ఎర్రవల్లి, ఉదండాపురం, మల్దకల్‌లో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలియజేశారు. నిందితుల నుంచి రూ.41వేల నగదు, 30 కిలోల రాగి, 15 కేజీల ఇత్తడి, ఆటో స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

ద్విచక్ర వాహనాలు ఢీ.. యువకుడి మృతి

ద్విచక్ర వాహనాలు ఢీ.. యువకుడి మృతి