
తగ్గుముఖం పట్టిన వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో 1.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఆదివారం రాత్రి 7.30 సమయంలో 1.08 లక్షలకు తగ్గినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్టు 6 క్రస్ట్ గేట్లను ఎత్తి 61,788 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. విద్యుదుత్పత్తి నిమిత్తం 32,095 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, నెట్టెంపాడుకు 750, ఆవిరి రూపంలో 44, ఎడమ కాల్వకు 1,250, కుడి కాల్వకు 680 క్యూసెక్కులు వినియోగించినట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.750 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు.
సుంకేసులకు కొనసాగుతున్న వరద..
రాజోళి: సుంకేసుల జలాశయానికి ఆదివారం ఎగువ నుంచి వరద వచ్చి చేరింది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి 26 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఆరు గేట్లు మీటర్ మేర పైకెత్తి 25,662 క్యూసెక్కుల నీటిని దిగువకు, కేసీ కెనాల్‌కు 1,847 క్యూసెక్కులు వదిలినట్లు జేఈ మహేంద్ర వివరించారు.
జూరాల ప్రాజెక్టుకు 1.08 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
6 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల