
నిర్వాసితుల త్యాగం మరువలేనిది
జడ్చర్ల: తరతరాలుగా అనుభవిస్తున్న భూములు, ఇళ్లను లక్షలాది మంది రైతుల కోసం చేసిన నిర్వాసితుల త్యాగాన్ని చరిత్ర ఎన్నటికీ మరచిపోలేదని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. మండలంలోని వల్లూరు గ్రామం వద్ద వేలాది మంది ఉదండాపూర్ నిర్వాసితులతో ఆదివారం ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా నిర్వాసితులకు భోజనం వడ్డిస్తూ.. వారి ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని, కనీసం వారి గోడును విన్న పాపాన కూడా పోలేదన్నారు. తాము మొదటి నుంచి నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు ఆందోళనలు చేపట్టినట్లు గుర్తుచేశారు. నిర్వాసితుల కోసం సొంత ప్రభుత్వంపైనే పోరాడుతున్నానని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని రూ.16.30 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచేందుకు ఒత్తిడి చేస్తున్నానన్నారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు తమ ప్రభుత్వం అండగా ఉందన్న విషయాన్ని వారికి భోజనం పెట్టి మరీ చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి తనకు ఫోన్ చేసి చెప్పారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 9లోగా పూర్తిస్థాయిలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవైపు పాలమూరు బిడ్డ సీఎంగా.. మరోవైపు జడ్చర్ల నియోజకవర్గ అల్లుడిగా నీటిపాదరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఈ ప్రాంత సమస్యలు తెలిసి ప్రజలతో మమేకమైన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ మల్లురవి అండగా ఉన్నారని గుర్తు చేశారు. ప్రజల సహకారం ప్రభుత్వానికి ఉంటే మరింత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం నిర్వాసితులు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ జ్యోతి, మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.